
ఈశాన్య రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికల పడటానికి కారణాలు అనేకం ఉన్నాయి. సరైన వ్యూహాలను అనుసరించకపోవడం, నాయకత్వ లేమి, పోల్ మేనేజ్ మెంట్ లో నిర్లక్ష్యం వంటి కారణాలు ఆ పార్టీని ఈశాన్యంలో ఊసే లేకుండా చేశాయి. స్థానిక పార్టీలను కలుపుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించలేదు. జాతీయ పార్టీ వెంటనే ప్రాంతీయ పార్టీలు నడవాలన్న కాంగ్రెస్ ఆలోచనలే కొంపముంచాయన్న విశ్లేషణలు కూడా విన్పిస్తున్నాయి.
కాంగ్రెస్ నా మాట వినలేదు….
ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యమే ఈశాన్యంలో ఆ పార్టీ విజయానికి అడ్డుకట్ట వేసేందని మమత అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలవడానికి పరోక్షంగా కాంగ్రెస్ దోహదపడిందన్నారు. బీజేపీని ఓడించాలంటే ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్లాలని తాను రాహుల్ గాంధీకి సూచించానని, అయితే నా మాటలను రాహుల్ పెడచెవిన పెట్టారన్నారు మమత.
బీజేపీకి అంత సీన్ లేదు….
మూడు రాష్ట్రాల్లో ఓటమికి కాంగ్రెస్ నిర్లక్ష్యమే కారణమని, సక్రమంగా పోరాట పటిమ చూపి ఉంటే కాంగ్రెస్ కు కనీసం పది స్థానాలైనా దక్కి ఉండేవని మమత అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎవరి మాట వింటారో కూడా అర్థం కావడం లేదన్నారు. ఇక తమ నెక్ట్స్ టార్గెట్ బెంగాల్, ఒడిషా, కేరళ రాష్ట్రాలేనని అమిత్ షా చేసిన ప్రకటనపై మమత మండిపడ్డారు. అవన్నీ వారి కలలేనన్నారు. 2019 ఎన్నికల గెలుపు ఎన్డీయేకు అంత సులువు కాదని ఆమె తెలిపారు. త్రిపురలో బీజేపీకి, వామపక్ష పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం ఐదు శాతం మాత్రమేనన్న విషయాన్ని బీజేపీ నేతలు గుర్తిస్తే బాగుంటుందన్నారు మమత.
Leave a Reply