కాపు రిజర్వేషన్ సాధ్యమేనా?

ఓ వైపు ముద్రగడ హెచ్చరికలు….మరోవైపు మంత్రుల విమర్శలు…….కాపుల రిజర్వేషన్లపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన పనిలేదని ప్రభుత్వ హామీలు……ఇంతకీ కాపుల్ని బీసీల్లో చేర్చే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం కష్టం…..2014 సార్వత్రిక ఎన్నికల్లో కాపుల్ని బీసీల్లో చేర్చేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన 19 నెలల తర్వాత కర్ణాటక హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ మంజునాథ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. తొమ్మిది నెలల్లో నివేదిక ఇచ్చి ఏడాదిలోగా కాపుల్ని బీసీల్లో చేర్చేలా రాజ్యాంగ
ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఈ మధ్యలో కాపుల అభివృద్ధికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి స్వయం ఉపాధి పథకాలు., విదేశీ విద్యకు సహకారం వంటి స్కీముల్ని కూడా అమలు చేస్తున్నారు.

అంత ఈజీ కాదు….

చూడ్డానికి అంతా బాగానే ఉన్నా కాపుల రిజర్వేషన్ అంశం మాత్రం అంత తేలిగ్గా తెగేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో కాపు., బలిజ., ఒంటరి., తెలగ కులాల్ని బీసీల్లో చేర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినా ఆచరణలో అవి ఎంతవరకు ఫలిస్తాయో ఎవరు చెప్పలేని పరిస్థితి…. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా రిజర్వేషన్లను అమలు చేస్తే హర్యానా., ఉత్తరాఖండ్‌లో ఎదురైన పరిస్థితి ఇక్కడ కూడా తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సామాజిక స్థితి గతుల్ని అధ్యయనం చేసేందుకు ప్రజాసాధికార సర్వే ప్రారంభించింది. అంతకు కొద్ది నెలల ముందే జస్టిస్ మంజునాధ కమిషన్ అధ్యయనం కూడా ప్రారంభించింది. జస్టిస్ మంజునాథ బాధ్యతలు చేపట్టి సరిగ్గా ఏడాది కావొస్తోంది. అయినా ఇప్పటికీ చాలా జిల్లాల్లో బహిరంగ సమావేశాలు జరగలేదు. మరోవైపు కాపుల్ని బీసీల్లో చేర్చడంపై బీసీ సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.

నలిగిపోతున్న కాపు మంత్రులు…

కమిషన్ ఏర్పాటైన తొలినాళ్లలో ఖచ్చితంగా 9నెలల్లో నివేదిక వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం., మంత్రులు బల్లగుద్ది చెప్పేవారు. మధ్యలో ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్ష., తదనంతర పరిణామాలు తలెత్తినా ఈ వివాదంలో కాపు మంత్రులు కూడా ప్రభుత్వంపై పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేయలేని పరిస్థితి….. ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ప్రతిసారి వాటిని తిప్పి కొట్టాల్సిందిగా ప్రభుత్వ పెద్దలు వారిని ఒత్తిడి చేయం పరిపాటై పోయింది. ముద్రగడకు బహిరంగ లేఖ అంటూ ప్రకటన విడుదల చేసి అందులో సంతకాలు కూడా చేయకపోవడమే వారి ఉద్దేశాలను బయటపెడుతోంది. ఓవైపు మంత్రి పదవి మరోవైపు సామాజిక సమీకరణాల మధ్య కాపు మంత్రులు నలిగిపోతున్నారు.

అటకెక్కిన సర్వే ప్రక్రియ….

కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితోనే ఉన్నా టీడీపీకి మొదట్నుంచి అండగా ఉన్న బీసీ వర్గాలు దూరమయ్యే పరిస్థితులుండటం., క్యాబినెట్‌లో ఉన్న ఇతర సీనియర్ బీసీ మంత్రులు కూడా రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుండటం ముఖ్యమంత్రికి మింగుడుపడటం లేదు. రాష్ట్ర విభజన తర్వాత మొదటి రెండు స్థానాల్లో ఉన్న సామాజిక వర్గాలకు తోడు రిజర్వేషన్లు దక్కితే కాపులు మూడో స్థానాన్ని ఆక్రమిస్తారనే ఆందోళన బీసీ మంత్రుల్లో ఉంది. ఇది తమ ఉనికికే ప్రమాదమనే భావనను ముఖ్యమంత్రి వద్ద సైతం వ్యక్తం చేశారు. ఇక కాపు రిజర్వేషన్లను ప్రజాసాధికారత సర్వేతో ముడిపెట్టడం కూడా వ్యూహాత్మకమేనని చెబుతున్నారు. కోస్తా జిల్లాల్లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు రిజర్వేషన్లతో బలమైన రాజకీయ శక్తిగా మారతారనే ఉద్దేశంతో సామాజిక అధ్యయనం చేపట్టారు. ప్రజాసాధికారత సర్వే ఆధారంగా వెనుకబడిన వర్గాల్లో కాపుల్ని అన్ని జిల్లాల్లో చేర్చడం కూడా సాధ్యపడకపోవడంతో సర్వే ప్రక్రియనే అటకెక్కించినట్లు తెలుస్తోంది. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఎంతో కొంత ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం ఉండటం వల్లే ఈ అంశాన్ని ఎన్నికల వరకు సాగదీయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Ravi Batchali
About Ravi Batchali 19203 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*