కూతురి వైపే కేసీఆర్ మొగ్గు

కల్వకుంట్ల కవిత. తెలంగాణలో ఈ పేరు సుపరిచితం. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. ఉద్యమ సమయంలో తండ్రికి కొండంత అండగా నిలిచారు. అలాంటి కల్వకుంట్ల కవిత త్వరలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు కాబోతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే పక్షం రోజుల్లోనే ఈ నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటిస్తారని టీఆర్ఎస్ భవన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

తీరిక లేకనే….
ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై ఆయన నిత్యం సమావేశాలతో సతమతమవుతున్నారు. సమయాభావం కారణంగా పార్టీని ఇటీవల కాలంలో పెద్దగా పెద్దాయన పట్టించుకోవడం లేదు. పార్టీ నేతలు కూడా ఆయన్ను కలిసే అవకాశమే తక్కువ. తెలంగాణలో జిల్లాల సంఖ్య పెరిగిన తర్వాత జిల్లాకొక అధ్యక్షులొచ్చారు. వారితో విడివిడిగా మాట్లాడే తీరికా సీఎంకు లేదు. ఇక ఎన్నికలకు రెండున్నరేళ్లే సమయం ఉండటంతో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పార్టీని పటిష్టం చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇటు ముఖ్యమంత్రి బాధ్యతలతో పార్టీ కార్యక్రమాలను సమర్దవంతంగా నిర్వహించలేనని ఆయన ఓ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ నేతలకు దశాదిశానిర్దేశనం కూడా చేయలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. అందుకే పార్టీ అధ్యక్ష బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని ఏడాది క్రితమే గులాబీ దళపతి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే పార్టీలో అందరిని కలుపుకుని పోయే వ్యక్తి ఒక్క కవిత మాత్రమేనని ఆయన గుర్తించారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ముఖ్యమైన శాఖలతో తీరిక లేకుండా ఉన్నారు. ఐటీ శాఖతో పాటు మున్సిపల్ శాఖ కూడా కేటీఆర్ చూడాల్సి రావడంతో నిత్యం ఆయన బిజీగానే ఉంటున్నారు. అందుకోసమే ఎంపీగా ఉన్న కవితకు పార్టీ బాధ్యతలను అప్పగించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఇందుకు ఆయన తన సన్నిహితులు, మంత్రివర్గ సహచరుల్లో కొందరితో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. వారందరూ ఏకగ్రీవంగా కవిత పేరుకు ఓకే చెప్పడంతో త్వరలోనే కవితకు గులాబీ పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు.

ప్రత్యర్థులకు పంచ్ లతో సమాధానం…
కవిత ఉపన్యాసాల్లో దిట్ట. కేసీఆర్ లాగే కవిత కూడా మాట్లాడుతుందని.. …. తండ్రి పోలికలే పుణికి పుచ్చుకుందని అంటారు. ప్రతిపక్ష పార్టీ నేతలు చేసే విమర్శలను కూడా కవిత దీటుగా తిప్పికొడతారు. సరైన సమయంలో పంచ్ లు వేసి జనాన్ని ఆకర్షిస్తారు. అలాంటి కవిత అయితేనే ఎన్నికల సమయంలో కూడా ప్రచారంలో దూసుకెళతారంటున్నారు టీఆర్ఎస్ అభిమానులు. పార్టీ నేతలతో కూడా కవిత ఓపిగ్గా చర్చిస్తారు. అధిక సమయాన్ని వెచ్చిస్తారు. పార్లమెంటు సభ్యురాలు కావడంతో సమావేశాల సమయంలో తప్పించి మిగిలిన సమయమంతా పార్టీ కోసం వినియోగిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

హరీశ్ కూడా సమర్ధుడే…
అయితే కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు సమర్ధుడు. ప్రత్యర్ధులు కూడా ఆయన్ను పొగిడే పరిస్థితి. మామకు వెన్నంటే ఉంటూ ఆయనకు అవసరమైన సమయంలో చేదోడు వాడుగా హరీశ్ ఉంటారు. అందరిని ఆప్యాయంగా పలుకరిస్తూ….కలుపుకు పోతారనేది పార్టీలో విన్పిస్తున్న అభిప్రాయం. ఇప్పటికే టీఆర్ఎస్ ఎక్కువ మంది కేసీఆర్ తర్వాత హరీశ్ నే ఎక్కువగా నమ్ముతారు. మేనమామ వ్యూహాలన్నీ హరీశ్ కు అబ్బాయి. అలాంటి హరీశ్ ను కాదని కవితకు అప్పగించడం సరికాదన్నది పార్టీలో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. అయితే హరీశ్ ముఖ్యమైన భారీ నీటిపారుదల శాఖను నిర్వహిస్తుండటం…. మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పథకాల అమలు త్వరగా చేయాల్సి రావడంతో కేసీఆర్ ఆ బాధ్యతలను హరీశ్ కు అప్పగించడం లేదని కొందరు చెబుతున్నారు. మొత్తం మీద పార్టీ అధ్యక్ష పదవిని కవితకు అప్పగించేందుకు రంగం అంతా సిద్ధమైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*