కూలీల కడుపుకొట్టారు

అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం లోకల్ కు స్థానం లేదు. అంతా బయటి వారే. సింగపూర్, మలేషియా గురించి వల్లె వేసే పాలకులు సామాన్యుల పైన కూడా కరుణ చూపించడం లేదు. ఏపీ విభజన జరిగి…. అమరావతిని రాజధానిగా ప్రకటించి నప్పుడు ఆ ప్రాంతంలో పండగ చేసుకున్నారు. రాజధాని మనదే కనుక మనకికి ఢోకా లేదనుకున్నారు. కడుపు నిండా తిండి…కంటి నిండా నిద్ర దొరుకుతుందని ఆనందపడిపోయారు. కాని అంత సీన్ లేదని చెప్పేశారు పాలకులు. తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో లోకల్స్ ను అసలు పనిలోకే తీసుకోలేదు. ఒడిషా, బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూలీలను తెప్పించి నిర్మాణం చేశారు.

అంతా నాదేననుకుని…

రాజధాని ప్రాంతాన్ని ప్రకటించగానే అమరావతి చుట్టుపక్కల గ్రామాల రైతు కూలీలు ఆనందంలో తేలియాడు. నేనే కూలీ నెంబర్ 1 అనుకున్నాడు. దాదాపు రాజధాని ప్రాంతానికి ఆనుకుని 30 గ్రామాల్లో 70 వేలమంది వరకూ రైతు కూలీలున్నారు. అక్కడ అరటి తోటలు, బత్తాయి, ఆకుకూరలు వంటి వాటితో పాటు వరి సాగు చేస్తుండటంతో చేతి నిండా పని దొరికేది. పచ్చటి పొలాల్లో పాడుకుంటూ పనిచేసుకుంటూ ఒక్కొక్క కూలీ రోజుకు 150 రూపాయలు సంపాదించేవాడు. మూడు పంటలు పండే భూములు కావడంతో సంవత్సరం మొత్తం చేతినిండా పని ఉండేది. ఒక్కో కుటుంబం నుంచి ముగ్గురు పనికెళితే దాదాపు పదిహేను వేలు నెలకు సంపాదించుకునేవాళ్లు. హ్యాపీ..హ్యాపీగా గడిచిపోయే వారి జీవితంలో రాజధాని వచ్చేసింది. రైతులందరూ భూములు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చేశారు. అయితే రాజధాని నిర్మాణంలో తామూ ఒక ఇటుకగా మారవచ్చనుకున్న వారు ఎంతో ఆనందపడ్డారు. నిర్మాణ పనుల్లో తమకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఆశపడ్డారు. ప్రభుత్వం కూడా భూసమీకరణ జరిపేటప్పడు అలాగే హామీలు కూడా ఇచ్చింది. ఒక్కొక్క కూలీ కుటుంబానికి నెలకు రూ.2,500లు పెన్షన్ ఇస్తామంది. రాజధాని ప్రాంతంలో పెద్దయెత్తున నర్సరీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఏడాది మొత్తం ఉపాధి హామీ వారికి అమలయ్యేలా చూస్తామని చెప్పింది. కాని హామీలు ఇప్పటి వరకూ అమలుకు నోచుకోలేదు.

రోడ్డున పడ్డ బతుకులు…

కాని ఇప్పడు వారు రోడ్డున పడ్డారు. పింఛను ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినా ఒక్క కుటుంబానికి రూ.2500లు ఏం సరిపోతుందని ప్రశ్నిస్తున్నారు. పోనీ పనేమైనా దొరకుతుందనుకుంటే వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ఇక్కడి కూలీలను అసలు పనికి పిలవనే లేదు. ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనికానిచ్చేశారు. అదేమిటంటే వారు తక్కువ డబ్బుకు వస్తున్నారని చెప్పారన్నారు. భూములు తీసుకున్న రెండున్నరేళ్ల నుంచి తమ పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రికి తెలిసి జరుగుతుందా? లేక అధికారులే చేస్తున్నారా? తమకు తెలియందంటున్నారు కూలీలు. అయితే ఈ సమస్యపై రైతు కూలీ సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. రైతు కూలీల బతుకులు ఛిద్రమయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. వారి పిల్లలు పస్తులుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా రాజధాని పేరుతో వారి బతుకులు కూల్చకుండా కూలీలకు ఉపాధి కల్పించాలని పలు సంఘాలు కోరుతున్నాయి.

Ravi Batchali
About Ravi Batchali 29117 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*