
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అడ్డంగా బుక్కయ్యారు. ఈ నెల 15న విశాఖ ఎయిర్ పోర్ట్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై ఎంపీ జేసీ వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అక్కడే ఉన్న కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు జేసీని తనతో పాటు అదే ఫ్లైట్ లో తీసుకెళ్లిపోయారు. అయితే జేసీ ఎయిర్ పోర్ట్ లో వ్యవహరించిన తీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడంతో కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు తాను ఆ సమయంలో అక్కడ లేనని, సంఘటన తర్వాత తెలుసుకుని జేసీని తనతో తీసుకెళ్లిన మాట వాస్తవమేనని అశోక్ మీడియాకు చెప్పారు. అంతేకాదు ఈ సంఘటనపై విచారణకు కూడా ఆదేశించామన్నారు. కాని ఇంతవరకూ విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియలేదు. జేసీ మాత్రం ఫ్లైట్ లోనే ఫారిన్ ట్రిప్ కు చెక్కేశారు. అయితే జేసీ ఒక జాతీయ ఛానెల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్ లో అశోక్ గజపతి రాజు ప్రమేయం పెదవి విప్పారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇది సంచలనం కల్గిస్తుంది.
ఆరోజు ఆయనే బోర్డింగ్ పాస్ ఇప్పించారు…..
స్టింగ్ ఆపరేషన్ లో జేసీ మాట్లాడుతూ తాను విమానశ్రయానికి వచ్చిన రోజు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అక్కడే ఉన్నారని, అశోక్ గజపతి రాజే మేనేజర్ ను పిలిపించి తనకు బోర్డింగ్ పాస్ ఇప్పించారని జేసీ వెల్లడించారు. రెడ్డి ఏది అడుగుతున్నారో అది ఇవ్వమని కూడా అశోక్ చెప్పినట్లు జేసీ కెమెరాకు చెప్పేశారు. ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తనపై దౌర్జన్యం చేశారని, అయితే తాను వెళ్లాలనే తొందరలో ప్రింటర్ ను పడవేయబోయానని కూడా చెప్పారు. ఆవేశంతో చేసిన పనేనని, అయితే తాను ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు జేసీ. ఈ స్టింగ్ ఆపరేషన్ టీవీల్లో ప్రసారం కావడంతో మరోసారి జేసీ వ్యాఖ్యలు సంచలనం కల్గిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం జేసీ చేత క్షమాపణలు చెప్పించాలని భావిస్తున్న తరుణంలో జేసీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజును కూడా ఈ ఘటనలో ఇరికించారు.
Leave a Reply