
పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని దెబ్బకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసిన బస్సులను ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వకూడదని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అరుణా చల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులు దాదాపు 900 వరకూ ఉండటంతో వాటన్నింటిని తిరగనివ్వకుండా చేయాలని రవాణాశాఖ అధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం తాము రద్దు చేసినట్లు ఉత్తర్వులను మాత్రమే వాట్సప్ ద్వారా మెసేజ్ పంపింది. అయితే రిజిస్ట్రేషన్ ను రద్దు చేసిన బస్సుల వివరాలను పంపాలని ఏపీ సర్కార్ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది. అయితే అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బస్సుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినా ఇక్కడి రవాణా శాఖ అధికారులు పట్టించుకోలేదని, రవాణా శాఖ మొత్తం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో ఈ అర్ధరాత్రి నుంచే 900 బస్సులను రద్దు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు.
నానికి లోకేష్ ఫోన్……
అయితే కేశినేని నాని ఆరోపణలపై రవాణా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రవాణా శాఖకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదన్నారు. వాట్సప్ మెసేజ్ ద్వారా వచ్చిన ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోలేమన్నారు అచ్చెన్నాయుడు. దీనిపైన కూడా కేశినేని నాని మండిపడ్డారు. చేతకాక ఉత్తర్వులను అమలు చేయలేదని పరోక్షంగా మంత్రిపై ధ్వజమెత్తారు. కేశినేని నాని వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాయి. బస్సులను రద్దు చేయకుంటే అవినీతిని ప్రోత్సహించినట్లవుతుందని భావించిన ప్రభుత్వం ఈరోజు హడావిడిగా ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పోర్చుగల్ లో ఉన్న మంత్రి నారా లోకేష్ కేశినేని నానికి ఫోన్ చేశారు. బస్సుల వివాదంపై బహిరంగంగా మాట్లాడవద్దని నానిని కోరారు. వచ్చే ఆదివారం కలిసి కూర్చుని ఈ అంశంపై చర్చిద్దామని లోకేష్ నానికి నచ్చ చెప్పారు. దీంతో కేశినేని నానికూడా మెత్తబడ్డారు.
Leave a Reply