కేసీఆర్‌కు మోడీ షాక్….

టీఆర్ఎస్, బీజేపీ

ఎస్సీ వర్గీకరణపై ప్రధానితో జరగాల్సిన తెలంగాన అఖిలపక్ష సమావేశం అనూహ్యంగా రద్దైంది. పిఎంఓ నుంచి శనివారం పొద్దుపోయాక తెలంగాణ ప్రభుత్వానికి సమాచారం అందింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో వర్గీకరణకు అనుకూలంగా అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రధానితో భేటీ కోసం సమయం కోరారు. తెలంగాణ అఖిలపక్షంతో ప్రధాని మోదీ సమావేశాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం పిఎంఓ సమాచారం పంపింది. ఆరో తేదీ సోమవారం ప్రధానితో భేటీ ఉంటుందని పిఎంఓ తెలిపింది. దీంతో అఖిలపక్షంలో ఢిల్లీ వెళ్లేందుకు రావాల్సిందిగా నేతలకు కేసీఆర్‌ స్వయంగా ఆహ్వానాలు పంపారు. ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్ రూపొందించారు. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్ రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి సమాచారం రావడంతో కేసీఆర్‌ విస్మయానికి గురయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఎస్సీ వర్గీకరణతో పాటుతెలంగాణకు సంబంధించిన సమస్యల పరిష్కారం., వివిధ పథకాల్లో కేంద్ర భాగస్వామ్యంపై చర్చించాలని కేసీఆర్ భావించారు. కీలకమైన భేటీగా భావించిన సమయంలో అపాయింట్్మెంట్‌ రద్దు కావడంతో కేసీఆర్‌ నిరాశకు గురయ్యారు.

రాజకీయ కారణాలే కారణం.
ఎస్సీ వర్గీకరణ అంశం దాదాపు రెండు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో రగులుతోంది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ ఏర్పాటుకు మద్దతిచ్చిన మందకృష్ణ మాదిగ., కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గీకరణపై జాతీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే వర్గీకరణ పరిమితం చేస్తే అది ఇతరత్రా సమస్యలు సృష్టించే అవకాశం ఉండటంతో ఎస్సీల వర్గీకరణ అధికారాలను రాష్ట్రాలకు బదలాయించాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. గతంలో కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్‌ నేత ఎస్‌.ఎం. కృష్ణ కూడా ఈ తరహా తీర్మానం చేసినందున జాతీయ పార్టీల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదని మందకృష్ణ ప్రతిపాదించారు. వర్గీకరణ విషయంలో యూపీలో మాయవతి వంటి నేతల నుంచి వ్యతిరేకత రావొచ్చని., ఉమ్మడి ఏపీకి భిన్నంగా యూపీలో మాయవతి వర్గం రిజర్వేషన్ల ఫలాలు పొందినందున ఎస్సీ వర్గీకరణను మాయవతి వ్యతిరేకిస్తారని., రాష్ట్రాల్లో పరిస్థితులు ఒక్కో చోట ఒకలా ఉన్నందున ఎస్సీల వర్గీకరణ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించాలని అఖిలపక్షంలో కోరాలని తీర్మానించారు. అయితే అఖిలపక్షం కేసీఆర్‌ నేతృత్వంలో ఢిల్లీ వెళితే అది టిఆర్‌ఎస్‌కు రాజకీయ లబ్ది చేకూరుస్తుందని బీజేపీ నేతలు భావించడం వల్లే మోడీ అపాయింట్‌మెంట్‌ రద్దైందని అనుమానిస్తున్నారు. యూపీ ఎన్నికలు జరుగుతున్న వేళ మాయవతి సైతం భేటీతో ప్రభావితం అవుతారని మోడీకి కొందరు నేతలు సమాచారమిచ్చారని., అందువల్లే ఈ భేటీ రద్దైందని చెబుతున్నారు. మరోవైపు మోడీ అపాయింట్‌మెంట్‌ రద్దు వెనుక రాజకీయ ప్రత్యర్ధుల వ్యూహం కూడా ఉండొచ్చని., బీజేపీ దాని మిత్రపక్షం టీడీపీ కూడా ఏపీలో వర్గీకరణతో ఇరకాటంలో పడే ప్రమాదం ఉండటం వల్లే మోడీ వెనక్కు తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*