
తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో మరోసారి తన సీటు మారుతున్నారా ? వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసేందుకకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే సీటు త్యాగం చేస్తారా ? అంటే కేసీఆర్ నియోజకవర్గం మారితే ఆ మహిళా ఎమ్మెల్యే తప్పుకునేందుకు సిద్ధంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ఎవరా లేడీ ఎమ్మెల్యే ? కేసీఆర్ కొత్తగా పోటీ చేసే నియోజకవర్గం ఏంటో ? ఈ స్టోరీలో తెలుసుకుందాం. కేసీఆర్ గత కొన్నేళ్లుగా వరుసగా ఎన్నికల్లో పోటీ చేస్తూ గెలుస్తున్నా….ఆయన ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారిపోతున్నారు.
నియోజకవర్గాలు మారుస్తుండటం….
2001, 2004లో సిద్ధిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 2004లో కరీంనగర్, 2009లో మహబూబ్‌నగర్, 2014లో మెదక్ నుంచి నియోజకవర్గాలు మారుతూ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో ఆయన మెదక్ ఎంపీగాను, గజ్వేల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవగా, మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ప్రతి ఎన్నికకు నియోజకవర్గం మారే అలావాటు ఉన్న కేసీఆర్ వచ్చే ఎన్నికల్లోనూ గజ్వేల్‌ను వదిలిపెట్టి మరో అసెంబ్లీ సీటు నుంచి పోటీ చేసే ఛాన్సులు ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ కంచుకోటలో….
ఈ సారి కేసీఆర్ కాంగ్రెస్ కంచుకోట అయిన నల్గొండ జిల్లాను టార్గెట్‌గా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలోనే కాంగ్రెస్‌లో ఉద్దండులైన ఉత్తమ్‌కుమార్ రెడ్డి (హుజూర్నగర్), ఉత్తమ్ భార్య పద్మావతి (కోదాడ), జానారెడ్డి (నాగార్జునసాగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ) ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డి సోదరుడు రాజ్‌గోపాల్‌రెడ్డి కూడా మునుగోడు నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరికి చెక్ పెట్టాలంటే తాను పాత నల్గొండ జిల్లాలోని ఆలేరు నుంచి పోటీ చేస్తే ఆ ఎఫెక్ట్ జిల్లా అంతటా ఉండి…ఈ బలమైన కాంగ్రెస్ నాయకులకు సైతం ముచ్చెమటలు పడతాయని కేసీఆర్ ప్లాన్‌గా తెలుస్తోంది.
మెదక్ లో బలంగా ఉందని….
ఆల్రెడీ పాత మెదక్ జిల్లాలో టీఆర్ఎస్ ఎలాగూ బలంగానే ఉంది. ఇప్పుడు నల్గొండ నుంచి పోటీ చేస్తే ఈ జిల్లాలో కూడా క్లీన్‌స్వీప్ చేయడమో లేదా ? ఎక్కువ సీట్లు సాధించవచ్చన్నదే కేసీఆర్ టార్గెట్. ఇక గజ్వేల్‌లో కేసీఆర్‌పై ఇటీవల కాస్త వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తోంది. పాములపర్తి ప్రాజెక్టు భూసేకరణ ఇక్కడ కేసీఆర్‌కు మైనస్. కేసీఆర్ ఫాంహౌజ్ చుట్టు ప్రాంతాలు ముంపునకు గురి కావడం లేదు కానీ తమ భూములు మాత్రం కోల్పోవాల్సి వస్తున్నదని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టీడీపీలో బలమైన నాయకుడిగా ఉన్న ప్రతాప్‌రెడ్డి వచ్చే ఎన్నికల వేళ కాంగ్రెస్‌లోకి జంప్ చేసి ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే కేసీఆర్‌కు సీఎం స్థాయి మెజార్టీ వస్తుందా ? అన్నది కూడా సందేహమే. గజ్వేల్‌లో అంచనాలు తగ్గే సూచనలు ఉండడం, నల్గొండలో టార్గెట్ నేపథ్యంలో కేసీఆర్ యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న గొంగడి సునీత ప్రభుత్వ విప్ అనే సంగతి తెలిసిందే. ఆమె కూడా సీఎం కోసం తన సీటును త్యాగం చేస్తుందని, ఈ విషయంలో ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. మరి ఈ సీటు సమీకరణలు వచ్చే ఎన్నికల నాటికి ఎలా మారతాయో ? చూడాలి.
Leave a Reply