
‘‘మోడీ సర్కార్ ఘోరంగా మోసం చేసింది. ఉత్తరాంధ్ర ప్రజలను నిలువునా ముంచింది. ఉత్తరాంధ్ర చిరకాల వాంఛ అయిన రైల్వే జోన్ కూడా ఇచ్చేందుకు కేంద్రం సుముఖతగా లేదు. ’’ అని మాజీ మంత్రి ఉత్తరాంధ్ర నేత కొణతాల రామకృష్ణ అభిప్రాయపడుతున్నారు. అందుకే కొణతాల విన్నూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈరోజు ఏపీ ఎక్స్ ప్రెస్ రైలులో 48 గంటల పాటు కొణతాల రామకృష్ణ నిరసనను తెలియజేయనున్నారు. విశాఖకు రైల్వే జోన్ తో సహా కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను ఈ బడ్జెట్ లో చేర్చాలన్నది కొణతాల రామకృష్ణ ప్రధాన డిమాండ్.
ఏపీ ఎక్స్ ప్రెస్ లో 48 గంటల దీక్ష….
అందుకోసం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఒక నేత రైల్లో దీక్ష చేపడుతుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఈమేరకు ఈరోజు ఏపీ ఎక్స్ ప్రెస్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. కొణతాలతో పాటు ఆయన అనుచరులు కూడా ఢిల్లీకి రైలులో వెళుతున్నారు. ఢిల్లీ వెళ్లేంత వరకూ నిరసన కార్యక్రమాలను కొణతాల రామకృష్ణ కొనసాగిస్తారు. అంటే 48 గంటల పాటు రైల్లోనే కొణతాల దీక్ష చేయనున్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ ఈరోజు బయలుదేరి 29వ తేదీన ఢిల్లీ కి చేరుకుంటుంది. అదేరోజు ఢిల్లీలోని రాజ్ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించి కొణతాల దీక్షను విరమించనున్నారు.
రైల్వే జోన్, ప్రత్యేక హోదా కోసం….
కొణతాల రామకృష్ణ. ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. కాని ఆయన ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి ఉద్యమిస్తూనే ఉంటారు. ఇందుకోసం ఉత్తరాంధ్ర చర్చా వేదికను రామకృష్ణ ఏర్పాటు చేశారు. దానికి ఆయన కన్వీనర్. కోటి మంది ఉన్న ఉత్తరాంధ్రను ఇటుకేంద్రం, అటు రాష్ట్రం పట్టించుకోక పోవడాన్ని కొణతాల తప్పుపడుతున్నారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్, ఉత్తరాంధ్ర, రాయలసీమలకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, ప్రత్యేక హోదా, విశాఖలో ఉన్న విమ్స్ ఆసుపత్రిని ఎయిమ్స్ గా మార్చాలని వంటి డిమాండ్లతో కొణతాల ఈ రైల్లో దీక్ష చేపట్టనున్నారు. కొణతాల ఉద్యమానికి ఉత్తరాంధ్ర నుంచి విశేష స్పందన లభిస్తుంది. కొణతాలకు మూడు జిల్లాల నుంచి వచ్చి ప్రజలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైలులో దీక్షతో ఢిల్లీకి వెళ్లే కొణతాల అక్కడ కేంద్రమంత్రులను, పార్లమెంటు సభ్యులను కలిసి తమ హామీల అమలుకు కృషి చేయాలని కోరతారు. వచ్చే బడ్జెట్ లో వీటికి నిధులు కేటాయించాలని వినతులు అందజేస్తారు. మరి కొణతాల విన్నూత్న ప్రయత్నం ఫలిస్తుందని ఆశిద్దాం.
Leave a Reply