
విశాఖలోని అతి విలువైన భూములను గీతం యాజమాన్యానికి ప్రభుత్వం కట్టబెట్టేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది. విశాఖలో ఇప్పటికే గీతం యూనివర్సిటీ ఉంది. దాని విస్తరణ కోసం గీతం యాజమాన్యం గతంలో 36 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఫైలును పక్కన పెట్టింది. విశాఖ – భీమిలీకి వెళ్లే రోడ్డులో ఉన్న 36 ఎకరాలంటే వందల కోట్ల విలువ చేస్తోంది. అయితే ఈ స్థలాన్ని అతి తక్కువ ధరకు కొట్టేయాలని గీతం యాజమాన్యం భావించింది. కాని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోకపోవడంతో ఫైలు వెనక్కు వచ్పేసింది. అయితే 2014 లో అధికారంలోకి తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మళ్లీ గీతం ఫైళ్లకు రెక్కలొచ్చాయి. ఆఘమేఘాల మీద ఫైలు విశాఖ నుంచి అమరావతికి చేరింది. ఇంకేముంది ప్రస్తుతం మంత్రివర్గం ముందుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. గీతం యూనివర్సిటీకి అప్పనంగా భూములు కట్టబెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనలపై విశాఖలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
36 ఎకరాలను అప్పనంగా కట్టబట్టే యత్నం……
గీతం యూనివర్సిటీ యజమాని ఎంవీవీఎస్ మూర్తి టీడీపీ ఎమ్మెల్సీ. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దగ్గర బంధువు. దీంతో గీతం ఫైల్ ను క్లియర్ చేసి పంపాలని పై నుంచి ఆదేశాలు రావడంతో ఆఘమేఘాల మీద అధికారులు కిందామీదా పడి ఫైలును తయారు చేసి అమరావతికి పంపారు. అయితే గీతం యూనివర్సిటీ థార్మిక సంస్థ ఏమీ కాదంటున్నారు విశాఖ వాసులు. ఫీజుల కింద లక్షల్లో వసూలు చేస్తున్న గీతం యాజమాన్యం కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టుకుని పక్కా బిజెనెస్ చేస్తుంది. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకుంటున్న గీతం యూనివర్సిటీకి తక్కువ ధరకు ఎలా భూములు ఇస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ గీతం విషయం చర్చకు వచ్చిందట. విశాఖకు చెందిన ఇద్దరు మంత్రులూ గీతం యూనివర్సిటీ విస్తరణకు భూములు ఇవ్వాల్సిందేనని చెప్పారు. అయితే ఒక సీనియర్ మంత్రి మాత్రం అతి విలువైన భూములను తక్కువ ధరకు ఇస్తే విమర్శలను ఎదుర్కొనాల్సి వస్తుంని తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టేశారట. అయితే గీతం యూనివర్సిటీకి 36 ఎకరాల భూమిని ఇచ్చేందుకే ప్రభుత్వం రెడీ అయిందని సమాచారం అందడంతో విశాఖలో ప్రజాసంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. గీతంకు భూములిస్తే తాము ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నాయి.
Leave a Reply