గీత దాటితే  వేటేనన్న బాబు

tdp leaders fight
మంత్రివర్గ విస్తరణపై రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, టిడిపి నేతలు ఆందోళనలు చేస్తున్న తరుణంలో సిఎం చంద్రబాబు పత్రికా ప్రకటన విడుదల చేశారు. మంత్రివర్గ విస్తరణపై అసంతృప్తి సబబు కాదని హితవు పలికారు. టిడిపి ఆది నుంచీ క్రమశిక్షణగల పార్టీ అని, నిబద్దతతో పనిచేస్తుందన్నారు. టిడిపి చరిత్రలో ఏనాడూ ఏ కార్యకర్త క్రమశిక్షణ ఉల్లంఘించిన సందర్భాలు లేవని, అందుకే అధికారంలో ఉన్నా, లేకున్నా ఇంతకాలం ప్రజాదరణ పొందిందని చెప్పారు. ఏ పదవి ఎవరికి ఇవ్వాలన్నా విస్తృత సంప్రదింపులు, సుదీర్ఘ కసరత్తు జరిపాకే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజ్యసభ, కౌన్సిల్ సభ్యత్వాలైనా, మంత్రిమండలికి ఎంపికైనా, పార్టీ పదవుల కేటాయింపులో కూడా ఈ ఆనవాయితీనే పాటిస్తామని చెప్పారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ కూడా అదే కోవలో జరిగిందని, అందరితో చర్చించి, అన్నివర్గాల వారిని సంప్రదించాకే ఎంపిక చేశామన్నారు. సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యం సహా అన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నామన్నారు. వివిధ ప్రాంతాలు, కులాలు, అనుభవం, అన్ని వయసుల ప్రాతినిధ్యం, రాజకీయ సమీకరణాల ప్రాతిపదికగా మంత్రివర్గ విస్తరణ చేపట్టామన్నారు. దీనిపై అసంతృప్తి సరికాదని, స్పోర్టివ్‌గా తీసుకోవాలని సూచించారు. పదవులు స్వల్పంగా, ఆశావహులు ఎక్కువగా ఉన్నప్పుడు అసంతృప్తి సహజమేనని, పదవి రానప్పుడు ఎవరికైనా నిరాశ కలుగుతుందని, దాన్ని అధిగమించాలని చెప్పారు. పార్టీకి సంబంధించిన అంశాలను పార్టీ అంతర్గత వేదికలపై చర్చించాలే తప్ప పత్రికలకెక్కడం సరికాదన్నారు. అందరూ ఏకతాటిపై నిలిచి పనిచేయాలని చంద్రబాబు సూచించారు. మూడేళ్ల పసికందు లాంటి రాష్ట్రాన్ని జాతీయంగా, అంతర్జాతీయంగా అగ్రగామిగా చేసేందుకు చేసే యత్నంలో క్రమశిక్షణారాహిత్యానికి చోటివ్వరాదని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి, రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చేపని చేయవద్దని సూచించారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించవలసి వస్తుందని చంద్రబాబు హెచ్చరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*