
ప్రజా సమస్యల పరిష్కార వేదిక…… అవినీతి అంతానికి సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1100 కాల్ సెంటర్ ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులకు కూడా ఉపయోగపడుతోంది. ఏ సమస్య వచ్చినా., ఎక్కడ ఏ అవినీతి జరిగినా వారి తాట తీసేందుకు కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దాదాపు 700మంది ఉద్యోగులతో విజయవాడలో కార్వీ ఆధ్వర్యంలో కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి దీనికి కాల్స్ వెల్లువెత్తుతున్నాయి. మే చివరి వారంలో దాదాపు 23,827 కాల్స్ 1100 వచ్చాయంటే దీనికి స్పందన ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
టీడీపీ నేతలపై ఫిర్యాదులు….
ఫిర్యాదులు వాటి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో కూడా తెలుసుకునే వీలు కల్పించారు. ఇదంతా చూడ్డానికి బాగానే ఉన్నా టీడీపీ నేతలకే తలనొప్పులు ఎక్కువయ్యాయి. గ్రామాల్లో గల్లీ గొడవల నుంచి సాగు నీటి ప్రాజెక్టుల్లో అవినీతి వరకు పనులు దక్కని వారు., నష్టపోయామనుకునే వారందరికి 1100 కల్పతరువుగా మారింది. సొంత పార్టీలో ప్రత్యర్ధులపై ఫిర్యాదు చేయడానికి కూడా వెనుకాడటం లేదు. నామినేషన్లపై వందల కోట్ల టెండర్లు అప్పగిస్తుండటం., అవి దక్కని వారు అవినీతి జరిగిపోతోందని కాల్ సెంటర్కు ఎకరువు పెడుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో ప్రభుత్వం గొంతులో వెలక్కాయ పడినట్లు తయారవుతోంది. ఆశ్రితుల అవినీతిని ఏమి చేయలేని పరిస్థితితో వాటిని ఎలా పరిష్కరించాలోనని మథన పడుతున్నారు. మొత్తానికి చంద్రబాబు దారిన పోయే సమస్యలను కాల్ సెంటర్ పేరుతో నెత్తికి చుట్టుకున్నాడని గుసగుసలాడుకుంటున్నారు.
Leave a Reply