
జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలన్న పవన్ ప్రయత్నానికి చంద్రబాబు గండి కొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని పవన్ అనుమానిస్తున్నారు. వీలయినంత దూరంగానే టీడీపీతో ఉండాలని పవన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకోసమే ఉద్దాన బాధితుల విషయంలో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు ఆహ్వానించినా పవన్ వెళ్లలేదు. అలాగని తాను రానని, వస్తున్నానని సమాచారం కూడా చంద్రబాబుకు ఇవ్వలేదు. దీంతో పొలిటికల్ సర్కిళ్లలో పవన్ వచ్చే ఎన్నికల్లో అధికార టీడీపీకి వ్యతిరేకంగానే గళం విప్పే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ముద్రను పవన్ చెరిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.
టీడీపీకి దూరంగా ఉండాలనే……
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను బాహ్యప్రపంచానికి తెలియజేసింది పవన్ కల్యాణ్ మాత్రమే. పవన్ కల్యాణ్ ఉద్దానం పర్యటించిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ఉద్దానంలో డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన వైద్యుల సమావేశానికి చంద్రబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి పవన్ లేవనెత్తిన అంశానికి తన ప్రభుత్వం చురుగ్గా వ్యవహరిస్తుందని తెలియజేయడం. రెండోది పవన్ తో మళ్లీ జతకట్టే ప్రయత్నం చేయడం. అయితే ఇది గమనించిన పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన మద్దతును ఎవరికీ ఉండదని, జనసేన ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పవన్ తన సన్నిహితులతోచెప్పారు. ముఖ్యంగా కాపు రిజర్వేషన్ల ఉద్యమం ఊపందుకోవడంతో చంద్రబాబుతో భేటీ మంచిది కాదని కూడా పవన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించినా పవన్ వెళ్లకపోవడం ఇప్పడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
Leave a Reply