చంద్రబాబుది ఆత్మవిశ్వాసమా..? అతి విశ్వాసమా?

chandrababunaidu on alliance

చంద్రబాబు పూర్తిగా అతివిశ్వాసంలో ఉన్నట్లు కన్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన టోన్ పూర్తిగా మారిపోయింది. పూర్తిగా టీడీపీ, తనపైనే విశ్వాసం ప్రజలు ఉంచి గెలిపించారని ప్రకటించారు కూడా. దాదాపు గంటసేపు కొనసాగిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావనే లేదు. అంతా తానే అయి… తన పాలన పట్ల పూర్తిగా ప్రజలు సంతృప్తితో ఉన్నట్లు చంద్రబాబు భావిస్తున్నారు. అందులో తప్పులేదు కూడా. నంద్యాల గ్రామీణ ప్రాంతం, కాకినాడ పట్టణ ప్రజలు కూడా టీడీపీ వైపే నిలబడటంతో ఆయన రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీదే అధికారమని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఆయన లెక్కలు ఆయన కుంటాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చినా రావచ్చు. ఎవరూ కాదనలేరు. కేవలం తనపై ఉన్న విశ్వాసంతోనే రెండు చోట్ల ప్రజలు గెలిపించారని ఆయన గట్టిగానే నమ్ముతున్నారు. అయితే నంద్యాలలో సానుభూతి, కాకినాడలో లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేశాయనడాన్ని ఆయన ప్రస్తుతం అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ఈ రెండు ఎన్నికలను మోడల్ గా చేసుకుని వచ్చే ఎన్నికల్లో స్వీప్ చేయాలన్నది బాబు వ్యూహంగా కన్పిస్తోంది.

నంద్యాల, కాకినాడలను మోడల్ గా తీసుకుంటే?

కాని రెండు ఎన్నికలనూ మోడల్ గా తీసుకుంటామనడమే కొంత అభ్యంతరకరంగా కన్పిస్తోంది. నంద్యాల ఉప ఎన్నికలు, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ నేతలు అనుసరించిన ప్రచారం, ఎలక్షనీరింగ్, పోల్ మేనేజ్ మెంట్ ను తాము మోడల్ గా తీసుకుంటామని చంద్రబాబు బహిరంగంగానే ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలకూ, సాధారణ ఎన్నికలకు చాలా తేడా ఉంటుంది. నంద్యాల, కాకినాడల్లో లాగా డజన్ల కొద్దీ మంత్రులు అక్కడే నెలల పడి తిష్టవేసే అవకాశం ఉండదు. చంద్రబాబు కూడా ఒక నియోజకవర్గంలో రెండు రోజులు పర్యటించే అవకాశం అంతకంటే ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎన్నికల వ్యూహాలు రచించిన ఈ ఉద్దండ పిండాలన్నీ తమ నియోజకవర్గాల ఎన్నికల్లో తలమునకలై ఉంటారు. మరి నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికలను ఎలా మోడల్ గా తీసుకుంటారన్నది అర్ధం కావడం లేదు. నంద్యాలలాగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వందల కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేసే ఛాన్సూ ఉండదు. మరి చంద్రబాబు నంద్యాల, కాకినాడను మోడల్ గా ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. ఇప్పటికే చంద్రబాబు దీనిపై ఒక పుస్తకం రూపొందించాలని ప్రచారంలో పాల్గొన్న మంత్రులను ఆదేశించారు. ప్రజల మద్దతు ఎలా కూడగట్టగలిగాం? ఏం ఏం హామీలిచ్చాం? నోటిఫికేషన్ కు ముందు…. తర్వాత ఎలాంటి ఎన్నికల వ్యూహాలను రచించామన్నది మంత్రులు ఈ పుస్తకంలో పొందుపర్చబోతున్నారన్నమాట. మరి సాధారణ ఎన్నికల్లో నంద్యాల, కాకినాడ వ్యూహాలు సాధ్యమా? అసాధ్యమా? అన్న చర్చ ఆపార్టీ లో జోరుగా జరుగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుది ఆత్మవిశ్వాసమైతే పర్వాలేదు… అతి విశ్వసమైతేనే ప్రమాదమంటున్నారు సీనియర్ నేతలు.

Ravi Batchali
About Ravi Batchali 30022 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*