
ఇటీవలి మంత్రి వర్గ విస్తరణ టీడీపీ సీనియర్లలో చాలామందిని అసంతృప్తికి గురి చేసింది. కొందరు రాజీనామాలు చేస్తే మరికొందరు బాబుని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే చంద్రబాబు లెక్కలు చంద్రబాబుకున్నాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. గతంలో ఏదొక కారణంతో బాబు మాటను ధిక్కరించిన వారిని సమయం చూసి చంద్రబాబు దెబ్బకొడుతున్నారు. ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నప్పట్నుంచి ఏదొక సమయంలో తనకు ఎదురు తిరిగిన వారందరికి బాబు షాక్ ఇస్తూనే ఉన్నారట. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఇలాగే పక్కన పెడితే ధూళిపాళ్లకు మంత్రి పదవి ఇవ్వకపోవడానికి మరో కారణం తెరపైకి వచ్చింది. గుంటూరు జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో పదవి దక్కుతుందని ఆశించి భంగపడ్డారు.
ధూళిపాళ్ల వీరయ్య చౌదరి వారసుడిగా సంగం డెయిరీ ఛైర్మన్ పదవితో పాటు 94 నుంచి ఓటమి లేకుండా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణలో మాత్రం ధూళిపాళ్లకు మొండి చేయి చూపారు. దీనికి కారణం 2004 -2009 మధ్య రాష్ట్రంలోని సహకార సంఘాల ఆధ్వర్యంలో ఉన్న డెయిరీలను మ్యాక్స్ (మ్యూచువల్లీ ఎయిడెడ్ కో ఆపరేటివ్ సొసైటీల పరిధిలోకి తీసుకువస్తూ రాజశేఖర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించారు. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో చాలా డెయిరీలో టీడీపీ గుప్పెట్లోనే ఉండేవి. సహకార చట్టం నుంచి మ్యాక్స్లోకి వాటిని విజయవంతంగా వైఎస్ మార్చడంతో చాలాచోట్ల పాలకమండళ్లు టీడీపీ చేయిజారిపోయాయి. గుంటూరు సంగం డెయిరీని మ్యాక్స్ పరిధిలోకి తీసుకువెళ్లొద్దని బాబు సూచించినా ధూళిపాళ్ల పట్టించుకోలేదట. ఆ సమయంలో మూడ్రోజుల పాటు బాబుకు కనీసం ఫోన్లో కూడా అందుబాటులో లేకుండా పోవడంతో బాబును ఆగ్రహాన్ని కలిగించింది. ఆ తర్వాత చాలాకాలం బాబుకు ధూళిపాళ్ల దూరంగా ఉండిపోయారు. అయితే కొన్నేళ్ల క్రితం దేవినేని ఉమా మధ్యవర్తిత్వంతో మళ్లీ పార్టీలో యాక్టివ్ రోల్లోకి వచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మంత్రి పదవిని ఆశించినా సామాజిక సమీకరణల దృష్ట్యా సాధ్యపడటం లేదని నచ్చచెప్పి ప్రత్తిపాటికి పదవిని కట్టబెట్టారు. అయితే తాజా మంత్రి వర్గ విస్తరణలోనైనా పదవి దక్కుతుందని దూళిపాళ్ల ఆశించినా అదీ జరగలేదు. ఇదంతా చంద్రబాబుతో ఉన్న పాత గొడవల పుణ్యమేనని వాపోవడం దూళిపాళ వంతైంది.
Leave a Reply