
ఏపీ సీఎం చంద్రబాబు వచ్చే ఎన్నికల్లోనూ అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. దీనికి గాను ప్రత్యేకంగా ప్రణాళిక సైతం సిద్ధం చేసుకున్నారు. తన పార్టీలోనూ, ప్రస్తుత సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో బాబు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గెలుపు గుర్రాలకు మాత్రం టికెట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో పొత్తులపై కూడా ఆయన ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న తలనొప్పులు వదిలించుకుని ఫ్రష్‌గా ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, అసలు ఫెయిల్యూర్ అంతా కూడా చంద్రబాబు వద్దే ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అయినా కూడా రాష్ట్రంలో అత్యంత కీలకమైన రాజధాని నిర్మాణాల విషయంలో ప్రజలు బాబుపై అసంతృప్తి వ్యక్తం చేస్తునట్టు తెలుస్తోంది.
ముందుగానే విజయవాడకు వచ్చి….
వాస్తవానికి ఏపీకి పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కానీ రాజకీయ కారణాల నేపథ్యంలో ముందుగానే బాబు విజయవాడకు వచ్చేశారు. ఇదే క్రమంలో అమరావతి రాజధానికి కూడా ఆయన శంకుస్థాపనలు అంటూ హడావుడి చేశారు. అంతేకాదు, కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీని ఆకట్టుకునేందుకు దేశంలోని పవిత్ర మట్టి, జలాలు అంటూ దేశంలోని అన్ని నదుల నుంచి నీళ్లు, మట్టి సేకరించి పోగు పెట్టారు. ఇక, ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోడీ కూడా గంగా జలం అంటూ కొన్ని నీళ్లు పవిత్ర మట్టి అంటూ కొంత మట్టి ఇచ్చి.. రాజధానికి శంకు స్థాపన చేసి… ఢిల్లీ చెక్కేశారు. ఇక, అక్కడి నుంచి చంద్రబాబుకు అసలు కష్టాలు స్టార్టయ్యాయి అనుకున్నారు అందరూ. రాజధాని నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అరకొర నిధులే వస్తున్నాయి.
అమరావతి నిర్మాణం ఎక్కడ?
ఇక, ఇప్పుడు ఏపీలో ఎన్నికల వాతావరణం ముసురుకుంది. దీంతో అందరూ రాజధాని అమరావతి నిర్మాణాలు పూర్తి అవుతాయని అందరూ అనుకున్నారు. అయితే, అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణాల డిజైన్లే ఇప్పటి వరకు పూర్తిగా ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఎన్నికల్లో ఈ విషయంపై చంద్రబాబు ఏం చెప్పాలి? ఎలా మాట్లాడాలి? ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయట. రాజధాని నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు వాటిని నిర్మించి లేదా కొంత మేరకు నిర్మాణాలను పూర్తి చేసి వాటిని చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించారు. అయితే, అవి పూర్తి అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు.
9 నెలల్లో పూర్తవుతుందా?
ఏపీ శాశ్వత రాజధాని భవనాల డిజైన్లు వచ్చి..టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలంటే మార్చి నెలాఖరు వరకూ పడుతుంది. అంటే అప్పటి నుంచి సర్కారుకు మిగిలేది కేవలం 9నెలలే. అందులో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పనులు జోరుగా సాగటానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలంలో పనులు ముందుకు సాగవు. ఈ లెక్కన ఎన్నికల నాటికి ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న కలల రాజధాని అమరావతికి సంబంధించి ఒక్క భవనం కూడా పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. మరి బాబు ఏ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వెళ్తారో చూడాలి.
Leave a Reply