జగనన్నా…ఈ ప్రశ్నకు బదులేదీ?

వైసీపీ అధినేత జగన్ ఆయన్ను ఎందుకు పక్కన పెట్టారు. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటు సభ్యుల రాజీనామా విషయమై కేంద్రానికి జగన్ డెడ్ లైన్ విధించారు. ఏప్రిల్ 6వ తేదీన తమ పార్టీకి చెందిన ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. తాజాగా జగన్ చంద్రబాబుకు సవాల్ విసిరారు. టీడీపీ ఎంపీలు కూడా తమతో కలిసి రాజీనామా చేస్తే ప్రత్యేకహోదా ఎందుకు రాదని ప్రశ్నించారు. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని చెప్పారు. అంటే పార్లమెంటు సభ్యుల రాజీనామాకే జగన్ పరిమితమయినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా విషయాన్ని మాత్రం జగన్ పక్కన పెట్టినట్లే కన్పిస్తోంది.

ప్రస్తుతం ఐదుగురు ఎంపీలే….

ఇది ఇప్పుడు తెలుగుదేశంపార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది. వైసీపీకి గత ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి మొత్తం 9 మంది ఎంపీలు గెలిచారు. వీరిలో ప్రస్తుతం ఐదుగురే మిగిలారు. అందులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాత్రమే మిగిలారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అరకు ఎంపీ కొత్తపల్లి గీత పార్టీని వీడారు. ఇక తెలంగాణలో ఎంపీగా గెలిచిన పొంగులేటి శ్రీనివాసులురెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు జగన్ పార్టీలో రాజీనామాకు సిద్ధపడింది ఐదుగురు ఎంపీలు మాత్రమే.

ఈ ఐదుగురు రాజీనామాలకు సిద్ధమే….

ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకరు అవినాష్ రెడ్డి జగన్ కు సమీప బంధువు. మరొకరు వైవీసుబ్బారెడ్డి జగన్ కు స్వయానా బాబాయి. ఇక మేకపాటి రాజమోహన్ రెడ్డి, మిధున్ రెడ్డిలు జగన్ మాటను జవదాటరు. మరో ఎంపీ వరప్రసాద్ ది కూడా అదే బాట. ఈ ఐదుగురు రాజీనామా లేఖలను ఇవ్వడానికి ఎప్పుడైనా రెడీ అంటున్నారు. అయితే విజయసాయి రెడ్డి విషయంలోనే జగన్ కొంత వెనకడుగు వేస్తున్నారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామాలంటే ఉభయ సభల్లోని సభ్యులందరూ రాజీనామా చేయాల్సి ఉంటుంది.

ఢిల్లీలో జగన్ బలం విజయసాయి…..

కాని విజయసాయి రెడ్డి విషయంలో మాత్రం జగన్ మినహాయింపు ఇచ్చినట్లు కన్పిస్తోంది. ఢిల్లీ స్థాయిలో విజయసాయిరెడ్డి ఇప్పటికే పార్టీ కార్యక్రమాలన్నీ చూస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని అపాయింట్ మెంట్ల దగ్గర నుంచి విజయసాయి చూస్తున్నారు. ఢిల్లీలో ప్రస్తుతం జగన్ బలం విజయసాయి రెడ్డి అన్నది కాదనలేని వాస్తవం. ఎన్నికల సమయంలో విజయసాయి రెడ్డి ఢిల్లీలో యాక్టివ్ రోల్ పోషించాల్సి ఉంటుంది. పొత్తుల విషయంలోనూ, కేసుల విషయంలోనూ విజయసాయి అవసరం జగన్ కు ఎంతో ఉంది. అందుకనే విజయసాయి రెడ్డి రాజీనామా విషయాన్ని జగన్ ప్రస్తావించడం లేదని తెలుస్తోంది. ఈ విషయాన్ని టీడీపీ అందిపుచ్చుకుంది. అందరి చేత రాజీనామా చేయిస్తానన్న జగన్ విజయసాయి రెడ్డి చేత ఎందుకు రాజీనామా చేయిస్తానని చెప్పటం లేదని సూటిగా ప్రశ్నిస్తుంది. దీనికి జగన్ సమాధానం చెప్పాల్సి ఉంది?

Ravi Batchali
About Ravi Batchali 23601 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*