
వైసీపీ అధినేత జగన్ ప్రజల్లో నమ్మకం కల్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనం విపరీతంగా పాదయాత్ర వద్దకు వస్తుండటంతో జగన్ కూడా కొంత ఉద్విగ్నతకు లోనవుతున్నారు. తాను మరణించిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండేలా పాలన చేస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఈ మాటతోనే జనాన్ని జగన్ ఆకట్టుకుంటున్నారు. జగన్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరుగుతోంది. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసిన ఉత్సాహంతో జగన్ హామీలను ఇస్తున్నారు. హామీలను ఇవ్వడమే కాదు వాటిని అమలు చేయకుంటే తనను జీవితంలో నమ్మవద్దంటూ వారికి చెబుతుండటం విశేషం.
తాను చనిపోయినా….
నెల్లూరు జిల్లా కలిచేడులో జగన్ చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అందులోనే ఇదే వ్యాఖ్యలు చేశారు. తానుచనిపోయిన తర్వాత తన ఫొటో, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫొటో ఉండేలా చేనేతలకు అండగా నిలుస్తానని సదస్సులో జగన్ మాట ఇచ్చారు. చేనేత కళాకారులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పై విరుచుకుపడ్డారు. నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు చేనేతలను ఆదుకున్న దెక్కడో చెప్పండని ప్రవ్నించారు. ఏడాదిలో ఎన్నికలు వస్తున్న తరుణంలో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. చంద్రబాబు పాలనలో ఎవరి జీవితాలు బాగుపడలేదన్న విషయం తన పాదయాత్రలో తనకు తెలిసిందన్నారు.
అభివృద్ధి అంటే ఇదా….
అభివృద్ధి అంటే నిన్నటి కంటే ఈరోజు బాగుండటమని, కాని చంద్రబాబు మాత్రం రోజురోజుకూ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. 34 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నా బాబు చలించలేదునక్నారు. ఆ కుటుంబాలను తాను పరామర్శించానని, వారి బాధలను తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తీరుస్తానని హామీ ఇచ్చారు. చేనేతలకు ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. 37 రోజులుగా చేనేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు.
నేడు పాదయాత్ర ఇలా….
జగన్ పాదయాత్ర 76వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో కలిచేడు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడి నుంచి మలిచేడు వద్ద సర్వేపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెడుతోంది. పొదలకూరు మండలం డేగపూడి, ఇంకుర్తి వరకూ పాదయాత్ర సాగుతుంది. మధ్యాహ్నం అక్కడ జగన్ భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి మర్రిపలల్లి పొదలకూరు వరకూ పాదయాత్ర జరుగుతుంది. పొదలకూరులో భారీ బహిరంగసభను వైసీపీ నేతలు ఏర్పాటు చేశారు. అక్కడే రాత్రికి జగన్ బస చేయనున్నారు.
Leave a Reply