
ప్రస్తుతమున్న రాజకీయాల్లో పదవులు దక్కాలంటే అంత వీజీకాదు. ఏదో ఒక బలం అనేది కామన్. సామాజికంగానైనా లేదా ఆర్థికంగానైనా నాయకులకు అండ ఉండాల్సిందే. ఒక్కొక్క సారి ఈ రెండూ ఉన్నా కూడా పదవులు దక్కనివారు ఎందరో కనిపిస్తున్నారు. ఇక, కొంత మందికి పరోక్షంగా కూడా సాయం అందుతోంది. ఇలాంటి వారిలో ఇప్పుడు వైసీపీ తరఫున త్వరలోనే రాజ్యసభకు వెళ్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు! రాజ్యసభ సభ్యత్వానికి ఈయన పేరు ఇప్పటికే ఖరారు చేసినట్టు వైసీపీ అధికార ప్రతినిధి, ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. అయితే, రాజ్యసభ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. అయినా కూడా ఇంత హుటాహుటిన వీపీఆర్ పేరు ప్రకటించడంలోని ఆంతర్యం ఏంటి? ఇంత అర్జంట్‌గా ఆయన పేరు ఎందుకు తెరమీదకి వచ్చింది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హడావిడిగా ఎందుకు ప్రకటించారు…..?
అయితే, తాజాగా వెలుగు చూసిన విషయాలను బట్టి.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లు వీవీఆర్ ను తమ వైపునకు లాక్కుంటారనే జగన్ ఆయన పేరును ఇంత అర్జంటుగా ప్రకటించారని తెలుస్తోంది. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఆర్థికంగా బలమైన సహకారం అందించారు వీపీఆర్. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కీలకంగా వ్యవహరించి వైసీపీ అత్యధిక సీట్లు గెలుచుకునేందుకు తోడ్పాటు నందించారు. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపుతామంటూ హామీ ఇవ్వడంతో వీపీఆర్ పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేవారు. అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, వీపీఆర్‌కు ఇస్తామన్న రాజ్యసభ సీటును విజయసాయిరెడ్డికి కేటాయించడంతో వీపీఆర్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఒక దశలో టీడీపీలోకి….
అప్పటి నుంచి ఆయన వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే సమయంలో ఆయన టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు జరిగాయి. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నుంచి పిలుపందుకుని వారితో వీపీఆర్ చర్చించారు. ఒకానొక దశలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరేందుకు వీపీఆర్ సిద్ధమయ్యారు. అయితే అనివార్య కారణాల వలన ఇది వాయిదా పడింది. అలా పలుమార్లు టీ డీపీలో చేరేందుకు ప్రయత్నాలు జరిగినా ముహూర్తం మాత్రం కుదరలేదు. ఇక, ఇంతలో మళ్లీ వైసీపీ నుంచి రాయబారాలు నడిచాయి. ప్రధానంగా వచ్చే ఎన్నికల్లో ఆర్థికంగా ఆదుకునేందుకు నెల్లూరులో వైసీపీకి వీపీఆర్‌ను మించిన వ్యక్తి లేడు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.. వైపీఆర్కు టికెట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. మొత్తానికి రాజ్యసభ అభ్యర్థి ప్రకటన వెనుక ఇంత తతంగం నడించిందన్నమాట.
Leave a Reply