జగన్ కన్ను అక్కడ పడింది….!

ఆంధ్రప్రదేశ్ లో రిజర్వడ్ నియోజకవర్గాలపై వైసీపీ అధినేత దృష్టి పెట్టారు. ఏపీలో మొత్తం 175 నియోజకవర్గాలుండగా అందులో దాదాపు 37 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. ఇందులో గత ఎన్నికల్లోనూ వైసీపీకి కొంత సానుకూలత ఫలితాలొచ్చాయి. ఈసారి కూడా ఈ నియోజకవర్గాల్లో అత్యధికంగా కైవసం చేసుకోవాలన్నది జగన్ ప్రయత్నం. రిజర్వడ్ నియోజకవర్గాల్లో క్యాడర్ బలంగా ఉన్నప్పటికీ అక్కడ నేతలకు ఆర్థిక వనరులను సమకూర్చాల్సిన బాధ్యత పార్టీపైనే ఉందని జగన్ సీనియర్ నేతలతో అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేయడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని జగన్ సూచించారు.

ఈ నియోజకవర్గాలపై ప్రత్యేకంగా….

ఏపీలో 37 ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నేతలతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలని జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం ఆ యా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఏం చేస్తే వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న అంశాలను వారితో చర్చించనున్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో జరిగిన…జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి నివేదిక ఇవ్వాలని పార్టీ నేతలను జగన్ కోరారు. దీని ప్రకారం పాదయాత్ర ఆ నియోజకవర్గాలకు వెళ్లినప్పుడు వారితో ఆ సమస్యలపై చర్చించడానికి వీలుంటుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల నేతలతో సమావేశం తేదీ ఖరారు కాకపోయినా… ఈనెలలోనే ఉండాలని జగన్ నేతలకు చెప్పినట్లు తెలిసింది.

వీటిపై జగన్ త్వరలో సమీక్ష….

శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ, రాజాం, విజయనగరం జిల్లాలోని కురుపాం, పార్వతీపురం, సాలూరు, విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు, పాయకరావుపేట, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, అమలాపురం, రాజోలు, గన్నవరం, ముమ్మడివరం నియోజకవర్గాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, గోపాలపురం, పోలవరం, చింతలపూడి, కృష్ణా జిల్లాలోని తిరువూరు, పామర్రు, నందిగామ, గుంటూరు జిల్లాలోని తాడికొండ, వేమూరు, ప్రత్తిపాడు, ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, కొండపి, ఎర్రగొండపాలెం, నెల్లూరు జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట, కడప జిల్లాలోని బద్వేల్, కోడూరు, కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు, అనంతపురంజిల్లాలోని సింగనమల, మడకశిర , చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా జగన్ సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది.

వీటికి ప్రత్యేక బాధ్యులు….

ముఖ్యంగా ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని జిల్లా ఇన్ ఛార్జులకు సూచించారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఉన్న ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు ఒక బాధ్యుడిని నియమించాలని కూడా జగన్ యోచిస్తున్నారు. అక్కడ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించే బాధ్యత వారికే అప్పగించనున్నారు. ఈ నియోజకవర్గాలను వచ్చే ఎన్నికల్లో చేజిక్కించుకుంటే సులువుగా అధికారంలోకి వస్తామని వైసీపీ విశ్వసిస్తుంది. అందుకోసం వీటికోసం ప్రత్యేకంగా కార్యచారణ ప్రణాళికను రూపొందించుకుంది. త్వరలోనే సమావేశమై ఈ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఓటర్లు వైసీపీ వేపే ఎక్కువగా ఉండటంతో కొంత కష్టపడితే వీటిని చేజిక్కించుకోవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కన్పిస్తోంది.

Ravi Batchali
About Ravi Batchali 35782 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*