
ఆపరేషన్ జగన్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అధికారపక్ష నాయకుల లక్ష్యం ఇదే. మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్న జగన్‌కి చుక్కలు చూపించేందుకు రంగం సిద్ధమవుతోంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించడంతో అధికారపక్షం కొంత ఊపిరి పీల్చుకుంది. ప్రతీ శుక్రవారం జగన్ సీబీఐ న్యాయస్థానానికి హాజరవడానికి పాదయాత్రని ఒకరోజు నిలుపుదల చేయాల్సి ఉంటుంది. ఇదే ప్రధాన అజెండాగా తీసుకుని జగన్‌ని ఇరుకునపెట్టేందుకు వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్థికనేరగాడిగా…..
జగన్ ఆర్థిక నేరస్థుడుగా, కోర్టుల చుట్టూ తిరిగే వ్యక్తిగా ప్రచారంలోకి తీసుకెళ్లేందుకు అధికారపక్షనేతలు తమ ప్రచారాన్ని సిద్ధం చేస్తున్నారు. సుస్థిరమైన అభివృద్ధి కావాలా? ఆర్థిక నేరస్థుడు కావాలా? అనే అంశాలు చర్చలో పెట్టేందుకు పథకం ప్రకారం వ్యూహరచన చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 2 నుంచి పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో నవంబరు 6వ తేదికి మార్పు చేసిన విషయం తెలిసిందే. ఇడుపాలపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు జగన్ నిర్వహించే పాదయాత్ర మొత్తం 120 నియోజకవర్గాల పరిధిలో సాగబోతుంది. దీనిపై చర్చించడానికి అక్టోబరు 26వ తేదిన లోటస్‌పాండ్‌లో ఎంపీ, ఎమ్మెల్యే,ఎమ్మెల్సీలతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు. పాదయాత్ర సమయంలో పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహాన్ని జగన్ వివరించనున్నారు. మరోవైపు నవంబరు 10వ తేది నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే శాసనసభ సమావేశాలకు హాజరవకుండా పూర్తిస్థాయిలో పాదయాత్రపైనే దృష్టిపెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా లోలోపుల వైకాపా శ్రేణుల్లో పాదయాత్రపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా వైఫే వాతావరణంలా అనధికార 144 సెక్షన్ అమలవుతుంది. ప్రభుత్వం తమకు అనుగుణంగా కావాల్సిన సమయంలో కావాల్సిన చోట 144 సెక్షన్ అమలు చేసుకొనే అవకాశం ఉంది. దీన్ని అవకాశం తీసుకుని జగన్ పాదయాత్రని దెబ్బతీస్తారేమోనన్న ఆందోళన ఉంది.
ముద్రగడ మాదిరిగానే….?
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ప్రారంభించాలనుకున్న పాదయాత్రని శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న కోణంలో ఎప్పటికప్పుడు నిలుపుదల చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకుని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జగన్ పాదయాత్రపై మంత్రి ఆదినారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర జరగాలి కానీ మధ్యలోనే అరెస్టుకావాలి అని ప్రకటించారు. వైకాపా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడం కాదు.. రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు జగన్ పాదయాత్ర కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఫలితం ఉండదని విమర్శించారు.
శాంతిభద్రతల సమస్యను చూపి….
2019 ఎన్నికల్లో పులివెందులతో సహా 175 అసెంబ్లీ నియోజకర్గాలు గెలుస్తామని ప్రకటించారు. జగన్ అద్దె మైక్‌లు పనికిమాలిన విమర్శలు చేస్తున్నాయనంటూ విరుచుకుపడ్డారు. ఇదే రకమైన దాడి జగన్ పాదయాత్ర సమయంలో తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మంత్రులు, పార్టీ నాయకులు మొత్తం జగన్ లక్ష్యంగా విమర్శల దాడి ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నారు. పోలీసు శాఖ కూడా పాదయాత్రపై డేగకన్నుతో వీక్షిస్తోంది. పాదయాత్రకు నియోజకవర్గాలవారీగా ఏర్పాట్లు చేస్తున్న నాయకుల చిట్టాని సేకరిస్తున్నారు. వారి బలాలు, బలహీనతలు సేకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మునుపెన్నుడూ లేనివిధంగా పోలీసుశాఖ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో నడుస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్ర నిరాటకంగా సాగుతుందా? మధ్యలో శాంతి భద్రతల సమస్య పేరుతో పాదయాత్ర నిలిచిపోయేలా ప్రభుత్వ పెద్దలే తెరవెనుక మంత్రాంగం నడుపుతారా? అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Leave a Reply