జగన్ నడక …ఈ నేతలను మార్చేసిందే…!

సాధారణంగా నేత నడత చూసి మనసు మార్చకుంటారు. కాని వైసీీపీ నేతలు మాత్రం జగన్ నడక చూసి మనసుమార్చుకుంటున్నారు. జగన్ పాదయాత్ర వైసీపీ నేతల్లో ఫుల్ జోష్ నింపుతుండగా, ఊగిసలాడుతున్న వారు కూడా మళ్లీ ఫుల్ టైం పార్టీ లీడర్లుగా మారుతున్నారు. నిన్న మొన్నటి వరకూ జగన్ వెంట నడుస్తారన్న నమ్మకం లేని లీడర్లు ఏపీలో చాలా మంది ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చాణక్య నీతి ముందు జగన్ మరోసారి ఓటమి పాలవుతారని కూడా కొందరు వైసీపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం జగన్ నాయకత్వంపై నమ్మకం లేక అధికార పార్టీలోకి వెళ్లిపోయారు. దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ టిక్కెట్ మీద గెలిచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరిలో నలుగురు మంత్రులు కూడా అయ్యారు. అయితే ఇదంతా పాతకధే అయినా… ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకూ పార్టీని వీడకుండా, అలాగని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉండే నేతలు కూడా అనేక మంది ఉన్నారు.

కొందరు నిరాసక్తతతో….

జగన్ పార్టీలో టిక్కెట్ వస్తుందా? రాదా? అని నమ్మకం లేక కొందరు, అధికారంలోకి వస్తారనే నమ్మకంలేక మరికొందరు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా చాలా మంది నేతలు పాల్గొనడం లేదు. వీరిలో నియోజకవర్గ ఇన్ ఛార్జులు, సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అయితే జగన్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత మాత్రం సీన్ మారిపోయింది. రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో జగన్ పాదయాత్ర విజయవంతం కావడంతో ఇప్పుడు పనిచేయని నేతలు సయితం పార్టీ జెండా పట్టుకుని నియోజకవర్గాల్లో తెగతిరిగేస్తున్నారు. ఈ విషయాన్ని పత్రికల్లోనూ, టీవీల్లోనూ చూసి వారు నిర్థారించుకోలేదు. జగన్ పాదయాత్ర కు స్వయంగా వెళ్లి పరిశీలించి వచ్చి చెబుతున్న వారి మాటలివి. జగన్ యాత్రకు అనూహ్య స్పందన వస్తుందని వారు గ్రహించి పార్టీ కోసం పనిచేయడానికే సిద్ధమయ్యారు.

కోలగట్ల అసలు విషయం చెప్పేశారు….

ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా నేత కొలగట్ల వీరభద్రస్వామి గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఆయనకు, బొత్స సత్యనారాయణకు పడక పార్టీ పదవికి రాజీనామా కూడా చేశారు. ఆయనను పార్టీలోకి తీసుకొచ్చేందుకు మంత్రులు సయితం రంగంలోకి దిగారు. కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే ఆయన గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. కోలగట్ల వీరభద్రస్వామి మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఈ నెల 29వ తేదీన జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం జిల్లాలో సంఘీభావ పాదయాత్రలు చేయాలని కోలగట్ల పిలుపునిచ్చారు. ఇందుకు భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అంతేకాదు ఆయన పార్టీ మారే విషయంలో క్లారిటీ కూడా ఇచ్చారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు. టీడీపీ సర్కార్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, టీడీపీలో చేరే దుస్థితి తనకు పట్టలేదన్నారు కోలగట్ల. వైఎస్ జగన్ వెంటే ఉంటానని, ప్రజాసంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని చెప్పారు. సర్వేలన్నీ వైసీపీకే అనుకూలంగా ఉన్నాయన్న ఆయన వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదేనన్న ధీమాను వ్యక్తంచేశారు. ఇలా కోలగట్ల ఒక్కరే కాదు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు జగన్ పాదయాత్ర చూసి వచ్చిన తర్వాత మనసు మార్చుకున్నారు. పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. సో… జగన్….పార్టీ నేతల్లో ఒక నమ్మకాన్ని కల్గించారన్నమాట.

Ravi Batchali
About Ravi Batchali 40408 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*