జగన్ నీటి మూటలు వెలికి తీస్తారా?

వైసీపీ అధినేత జగన్ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ప్రస్తుతం కడప జిల్లాలో పర్యటిస్తున్న జగన్ జిల్లాలో పలు ప్రాజెక్టులు సందర్శించనున్నారు. పైడిపాలెం ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తారు. అధికారులను అడిగి తెలుసుకుంటారు. అలాగే చెర్లోపల్లి పంప్ హౌస్ వద్ద కూడా ఆయన పర్యటన ఉంది. కడప జిల్లా తర్వాత అనంతపురం జిల్లాలోనూ ఆయన ప్రాజెక్టులపై పరిశీలన జరపనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను రాయలసీమను రతనాల సీమ చేస్తున్నాననడం, క‌ృష్ణా, గోదావరి జలాలను రాయలసీమకు తరలించానని చెప్పుకోవడంపై ఆయన నిజానిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవ పరిస్థితులకు పొంతన లేదనేది వైసీపీ వాదన అందుకోసమే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని జగన్ ఆకాంక్షిస్తున్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికలపైనా…
మరోవైపు ప్రాజెక్టుల సందర్శనతో పాటు త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా వైసీపీ అధినేత దృష్టి సారించనున్నారు. కడప జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ను మానసికంగా దెబ్బతీయాలంటే ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా టీడీపీ నేతలతో సమావేశమై ఎట్టిపరిస్థితుల్లో గెలవాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతం కడప జిల్లా టూర్ లో ఉన్నజగన్ ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా సమీక్షించనున్నారు. స్థానిక సంస్థల ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే టీడీపీ పావులు కదుపుతోంది. స్థానిక సంస్థల నేతలు కొందరు వైసీపీ నుంచి టీడీపీ లోకి వెళ్లిపోయారు. అయితే తిరిగి వారు వైసీపీలోకి వచ్చేలా జగన్ వ్యూహరచన చేశారు. ఇప్పటికే కొందరు వైసీపీ గూటికి చేరుకున్నారు. దీంతో జగన్ అలర్ట్ అయి ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని సాధించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హోరాహోరీగా సాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో గెలుపెవరిదో మరి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*