
వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు 22 మంది తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేశారు. వీరిలో నలుగురు మంత్రులయ్యారు కూడా. మంత్రులుగా అఖిలప్రియ, అమరనాధరెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయకృష్ణ రంగారావులు తెలుగుదేశం ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. అయితే వీరిలో జగన్ మీద ఒంటికాలుపై లేస్తుంది ఒక్క ఆదినారాయణరెడ్డి మాత్రమే. మిగిలిన 21 మంది ఎమ్మెల్యేలు పెద్దగా నోరు విప్పడం లేదు. అంతేకాదు మంత్రులు అఖిలప్రియ, అమర్ నాధరెడ్డి, సుజయకృష్ణ రంగారావులు కూడా పెదవి విప్పి జగన్ ను ఒక్క మాట కూడా అనడం లేదు. ఇది తెలుగుదేశం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
మంత్రి అఖిలప్రియ మౌనం….
నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిలప్రియ కొంత విమర్శలు చేసిన తర్వాత వైసీపీపై ఆమె పెద్దగా విరుచుకుపడటం లేదు. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ నేతల నుంచి తగిన సహకారం లేకపోవడంతో ఆమె మౌనం పాటిస్తున్నారని చెబుతున్నారు. మరో మంత్రి అమర్ నాధ్ రెడ్డి జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లా చేరుకున్నప్పుడు ఆయన కొంత హడావిడి చేశారు. ఇంటింటికీ తెలుగుదేశం ముగింపు కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించారు. గతంలో అమర్ నాధ్ రెడ్డి కూడా జగన్ పార్టీపై విరుచుకుపడేవారు. కాని ఇప్పుడు ఆయన సైలెంట్ అయ్యారని తెలుగుదేశం పార్టీలోనే గుసగుసలు విన్పిస్తున్నాయి.
రంగారావు సైలెంట్…..
ఇక పార్టీ మారి మంత్రి పదవిని చేజిక్కించుకున్న సుజయ కృష్ణ రంగారావు కూడా సేమ్ టు సేమ్. ఆయన మంత్రిగా అయిన కొత్తల్లో కొంత వైసీపీపై విమర్శలు చేసేవారు. అయితే ఆయనకు జిల్లాలోనే టీడీపీ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఆయనను మంత్రిగానే ఎమ్మెల్యేలు చూడకపోతుండటంతో కొంత మనస్తాపానికి గురయ్యారని చెబుతున్నారు. దీంతో ఆయన కేవలం అమరావతి, విజయనగరం జిల్లాకు మాత్రమే పరిమితయ్యారన్న టాక్ పార్టీలో నడుస్తుంది. ఇక మిగిలింది ఆదినారాయణరెడ్డి. ఆయన ఒక్కరే జగన్ పార్టీపైన విరుచుకుపడుతున్నారు. జగన్ పై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే సొంత జిల్లా కావడంతో పట్టుపెంచుకునేందుకు ఆదినారాయణరెడ్డి జగన్ పై విమర్శలు చేస్తున్నారని, ఒక్కొక్క సారి ఆయన వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయని పార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
వాయిస్ ఉన్న నేతలు కూడా….
ఇక వైసీపీ నుంచి పార్టీ మారిన మిగిలిన 18 మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారు. అంతేకాదు వారు వచ్చే ఎన్నికల్లో తమకు మళ్లీ సీటు తెచ్చుకోవడానికే తాపత్రయపడుతున్నారు తప్ప ప్రతిపక్ష పార్టీపైన ఎలాంటి విమర్శలు చేయడం లేదని చెబుతున్నారు. పార్టీ మారిన వారిలో ఎమ్మెల్యేలు జలీల్ ఖాన్, గిడ్డి ఈశ్వరి, గొట్టిపాటి రవికుమార్, జ్యోతుల నెహ్రూ వంటి వారు కొంత వాయిస్ ఉన్న నేతలు. వీరు కూడా నిశ్శబ్దంగా ఉండిపోయారని, తమ నియోజకవర్గంలో నిధుల కోసమే మంత్రుల చుట్టూ తిరుగుతున్నారన్నది పార్టీలో జరుగుతున్న చర్చ. మొత్తం మీద 22 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడి వచ్చినా అందులో చంద్రబాబుకు పనికొచ్చింది ఒకే ఒక్కరన్న సెటైర్లు పసుపు పార్టీలో విన్పిస్తున్నాయి.
Leave a Reply