జగన్ పార్టీ ఎమ్మెల్యేకు సొంత పార్టీ షాకిస్తుందా?

కర్నూలు జిల్లాలో వైసీపీకి గట్టి పట్టుంది. ఈ జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా టిక్కెట్ల కోసం ఆశావహులు పోటీ పడుతుంటారు. ముఖ్యంగా వైసీపీ నుంచి పోటీ తీవ్రంగానే ఉంది. గత ఎన్నికల్లోనూ కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోటగా నిలిచింది. రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది. 14 అసెంబ్లీ స్థానాలకు గాను 11 నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీకి ఇక్కడ గత ఎన్నికల్లో చుక్కెదురైంది. అయితే ఆ తర్వాత ఇద్దరు ఎంపీలు ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక పార్టీని వీడారు. ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి పార్టీ మారిన అనంతరం మరణించడంతో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా ఉప ఎన్నికల్లో గెలిచారు.

టిక్కెట్ల కోసం పోటీ….

అయితే జగన్ పాదయాత్ర పూర్తయిన తర్వాత అనేక నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. పార్టీ పిలుపునిస్తున్న కార్యక్రమాలను పోటీ పడి ఒకే నియోజకవర్గంలో ఇద్దరు నేతలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం అధిష్టానం దృష్టిలో పడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన కన్పించింది. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది. ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరామ్ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్ పై కేవలం రెండు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే జయరామ్ ఎక్కువగా బళ్లారిలో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో పార్టీ నేతలను పట్టించుకోవడం లేదన్న విమర్శలూ ఉన్నాయి.

పోటీగా కార్యక్రమాలు….

ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో జగన్ పాదయాత్ర జరుగుతున్నప్పుడు జయరామ్ ముఖ్య పాత్రనే పోషించారు. ఆయన తాజాగా తాగు, సాగునీటికోసం పాదయాత్ర కూడా తలపెట్టారు. అయితే 2009 ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి గెలిచిన పాటిల్ నీరజారెడ్డి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో నీరజారెడ్డి కాంగ్రెస్ తరుపున పోటీ చేయగా, పీఆర్పీ తరుపున పోటీ చేసిన గుమ్మనూరు జయరాం పోటీ చేశారు. నీరజారెడ్డి 2009 ఎన్నికల్లో జయరామ్ పై గెలుపొందడంతో ఆమె మళ్లీ పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. వాక్ విత్ జగన్ కార్యక్రమాన్ని కూడా పోటీగా నీరజారెడ్డి చేపట్టారు. దీంతో ఈ నియోజకవర్గంలో టిక్కెట్ కోసం వైసీపీలో తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. గత ఎన్నికల్లో జయరామ్ స్వల్ప ఓట్ల తేడాతోనే బయటపడటంతో ఈసారి జగన్ టిక్కెట్ ను కొత్తవారికే ఇస్తారా? లేక తననే నమ్ముకుని పార్టీని అంటిపెట్టుకుని ఉన్న జయరామ్ కు ఇస్తారో వేచి చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30886 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*