జగన్ పై ఆ వాయిస్ విన్పించదేంటి?

వైసీపీ అధినేత జగన్ రెండురోజుల నుంచి హస్తినలో మకాం వేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపుదారులను మంత్రివర్గంలోకి తీసుకోవడాన్ని తప్పుపడుతూ రాష్ట్రపతి నుంచి అన్ని పార్టీల  నేతలనూ కలుస్తున్నారు. చంద్రబాబు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని విమర్శిస్తున్నారు. కాని టీడీపీ నుంచి జగన్ ఆరోపణలను తిప్పి కొట్టేందుకు ఒక్క వాయిస్ కూడా విన్పించడం లేదు. గత మూడు రోజుల నుంచీ ఇదే పరిస్థితి. అలాగే వైసీపీ ఎమ్మెల్యే రోజాకూడా మంత్రివర్గ విస్తరణపై తీవ్ర ఆరోపణలుచేసింది. అయినా దీనికి సమాధానం టీడీపీ నుంచి లేదు. మంత్రివర్గ విస్తరణ తర్వాత టీడీపీ మెయిన్ వాయిస్ లు విన్పించడం లేదు. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించారు.
చంద్రబాబు దిద్దుబాటు చర్యలు…..
మంత్రివర్గ విస్తరణ తర్వాత తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అధినేతపై అలిగి అనేకమంది సీనియర్ నేతలు ఇంటి నుంచి బయటకు రావడం లేదు. పార్టీ అధికారికంగా నియమించిన ప్రతినిధులు కూడా మైకు పట్టుకోవడం లేదు. జగన్ చేసిన ఆరోపణలను ఎవరూ ఖండించలేదు. ఢిల్లీలో ఒక్క జేసీ దివాకర్ రెడ్డి మాత్రమే జగన్ ఆరోపణలపై స్పందించారు. ఇక మంత్రివర్గంలో  చేరిన వారు కూడా తాము బాధ్యతలు తీసుకోవడంలో బిజీగా ఉండిపోయారు. పార్టీ అధికార ప్రతినిధులపై చంద్రబాబు నిన్న  రాత్రి సీరియస్ అయ్యారట. జగన్ ఆరోపణలను ఖండించకుండా మౌనంగా ఎలా ఉన్నారని ప్రశ్నించారట. దీనికి కూడా వారి నుంచి మౌనమే సమాధానం రావడంతో చంద్రబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. అసంతృప్తి నేతలతో తనతో వన్  టూ వన్ సమావేశాలను ఏర్పాటు  చేయాలని పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావును ఆదేశించినట్లు తెలుస్తోంది. జగన్ ఆరోపణలను ఎవరూ ఖండించక పోతే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని, ప్రతి విషయానికీ తాను మీడియా ముందుకు రావడం తగదని చంద్రబాబు తన సన్నిహితుల వద్ద అన్నట్లు సమాచారం. మంత్రులు కూడా జగన్ ఆరోపణలపై నోరు మెదపకపోవడంపై చంద్రబాబు ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. మంత్రిపదవులు ఇచ్చింది  అధికారాన్ని అనుభవించడానికి కాదని, పార్టీపైన, ప్రభుత్వంపైన ఆరోపణలొస్తే స్పందించాలని మంత్రులకు చెప్పినట్లు సమాచారం. మొత్తం మీద తెలుగు తమ్ముళ్లలో నెలకొన్న అసంతృప్తి కారణంగా టీడీపీ వాయిస్ పూర్తిగా పడిపోయిందని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*