జగన్ మరోసారి అదే పని చేస్తారా….?

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 5వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు నెల రోజులకు పైగానే ఈ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశమైంది. మార్చి 5వ తేదీ నుంచే పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల చివరి రోజున వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు. తర్వాత దశల వారీగా సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే వరకూ రాజీనామా చేయాలన్న యోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది టీడీపీలోనూ మిగిలిన రాజకీయపార్టీల్లోనూ చర్చ జరుగుతోంది.

గత అసెంబ్లీ సమావేశాలకూ….

గత అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరుకాలేదు. నవంబరు 5వ తేదీన ప్రారంభమయిన శాసనసభ సమావేశాలకు వైసీపీ దూరంగా ఉంది. దీంతో అధికారపక్షమే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. అయితే ఈసారి జరిగేవి బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలకున్న ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. బడ్జెట్ లోకేటాయింపులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీ ఈ సమావేశాలకు హాజరయి తీరుతుందని ఆ పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లినా ప్రయోజనం లేదని, తమ గొంతునొక్కే ప్రయత్నం జరుగుతున్నప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండటమే మేలని గతంలో జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.

వైసీపీని తప్పుపట్టిన….

గత అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవ్వడంపై టీడీపీని పక్కనపెడితే మిగిలిన రాజకీయ పక్షాలు వైసీపీ తీరును తప్పుపట్టాయి. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ దుర్వినియోగం చేసుకుందని ఉండవల్లి వంటి వారే విమర్శించారు. అయినా ఆ సమావేశానికి ఎవ్వరూ హాజరుకాలేదు. అయితే జగన్ మాత్రం తమ పార్టీ నుంచి ఎన్నికై మంత్రులుగా పనిచేస్తున్న వారిని వెంటనే ఆపదవి నుంచి తొలగించాలని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై వేటు వేయాలని, అప్పుడే శాసనసభలోకి అడుగుపెడతామని చెబుతున్నారు. అంటే జగన్ ఈసారి సమావేశాలకు కూడా తన పార్టీ ఎమ్మెల్యేలను వెళ్లనీయరని ఒక టీడీపీ నేత వ్యాఖ్యానించారు.

హాజరైనా ప్రయోజనం లేదని….

సరిగ్గా అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయానికి జగన్ పాదయాత్ర గుంటూరు జిల్లాలో జరుగుతుంది. ఏపీ రాజధాని అమరావతి అదే జిల్లాలో ఉంది. మరి ఆ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ కీలకమైన బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్న. వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం ఇంతవరకూ ఎలాంటి సమాచారం లేదు. అయితే జగన్ మాత్రం అసెంబ్లీ సమావేశాలకు వెళ్లి ప్రయోజనమేంటని ప్రశ్నిస్తున్నారు. మరి జగన్ ఏపీ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇప్పుడు ఆ పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. మరి జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 30911 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*