
ప్రత్యేక హోదా కోసం ఇక ఉద్యమం తీవ్రతరం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. హోదాపై ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇప్పటి వరకూ హోదాపై యువభేరి లాంటి కార్యక్రమాలు చేపట్టిన జగన్ ఇక క్షేత్రస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. పార్టీ శ్రేణులకు హోదాపై పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. నేడు ప్రత్యేక హోదా కోసం చేస్తున్న బంద్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన పిలుపు నిచ్చారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని, ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆ నిధులను కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తుందన్నది వైసీపీ భావన. దీంతో ప్రత్యేక హోదా కోసం ఉద్యమించే వారందరినీ కలుపుకుని వెళ్లాలని జగన్ భావించారు. ఈ మేరకు వామపక్ష నేతలతో కూడా జగన్ మాట్లాడినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ అండగా ఉంటుదని జగన్ పార్టీ వామపక్షాలకు చెప్పింది.
నేడు యాత్రకు విరామం….
మరో వైపు జగన్ పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరుజిల్లాలో జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా కోసం ఈరోజు ఏపీ బంద్ జరుగుతుంది. ఏపీ బంద్ కు వైసీపీ కూడా మద్దతిచ్చింది. దీంతో జగన్ తన పాదయాత్రకు ఈరోజు విరామం ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి జరుగుతున్న అన్యాయాలకు నిరసనగా పాదయాత్రకు ఒకరోజు నిలుపుదల జగన్ చేయనున్నారు. ప్రత్యేక హోదా కోసం ప్రజలంతా సంఘటితంగా నిలబడాలని, ఐక్యంగా పోరాడినప్పుడే అనుకున్నది సాధించగలమని వైసీపీ స్పష్టం చేసింది.
మీడియా ముందుకు ఎందుకు రాలేదు?
ఇక జగన్ 84వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ముస్లింలతో ఆత్మీయ సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మైనారిటీలను దారుణంగా మోసంచేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఐదురోజులవుతున్నా చంద్రబాబు మీడియా ముందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతిరోజూ పని ఉన్నా లేకపోయినా…సూర్యనమస్కార పేరుతోనో, యోగా పేరుతోనో మీడియా ముందుకు వచ్చే చంద్రబాబు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఇంత అన్యాయం జరిగినా ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కేవలం మీడియాకు లీకులు మాత్రమే ఇచ్చి తాను ఆగ్రహంతో ఉన్నట్లు కలరింగ్ ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు వల్లనే రాష్ట్రానికి నిధులు అందడం లేదని ఆరోపించారు. నేడు ప్రజాసంకల్ప యాత్రకు బంద్ సందర్భంగా విరామం ప్రకటించారు జగన్.
Leave a Reply