
బెజవాడ నేతల్లో సయోధ్యను వైసీపీ అధినేత జగన్ కుదిర్చారు. గత కొంతకాలంగా వంగవీటి రాధ పార్టీని వీడుతున్నట్లుప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే రాధాతో ఇటీవల జగన్ మాట్లాడి బుజ్జగించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టిక్కెట్ఇస్తానని జగన్ హామీ ఇవ్వడంతో రాధా వెనక్కు తగ్గారు. అయితే ఇటీవల పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గౌతంరెడ్డి జగన్ పాదయాత్రలో కలవడంతో మళ్లీరాధాలో అసంతృప్తి బయలుదేరిందంటున్నారు. జగన్ పాదయాత్ర వద్దకు వెళ్లి గౌతమ్ రెడ్డి కలిసిన ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. దీంతో రాధా మరోసారి అలకపాన్పు ఎక్కారు.
రాధాకు నచ్చజెప్పి….
ఈ నేపథ్యంలో రాధాకు మరోసారి జగన్ ఫోన్ చేసి సెంట్రల్ టిక్కెట్ ఇస్తానని, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని గట్టిగా చెప్పినట్లు తెలిసింది. ఇటీవల వాక్ విత్ జగన్ కార్యక్రమంలో కూడా రాధా పాల్గొనకపోవడాన్ని జగన్ ప్రశ్నించినట్లు సమాచారం. అయితే గౌతంరెడ్డి విషయాన్ని రాధా మరోసారి జగన్ వద్ద ప్రస్తావించారు. అయితే గౌతమ్ తో ఎలాంటి ఇబ్బంది ఉండదని, ఆయన సంగతి తనకు వదిలేయాలని చెప్పారు. దీంతో రాధా సంతృప్తి చెంది పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
గౌతమ్ కూడా సహకరిస్తానంటూ…
అలాగే పాదయాత్రలో జగన్ ను కలిసి వచ్చిన తర్వాత గౌతమ్ రెడ్డిలో కూడా కొంత మార్పు కన్పించింది. గతంలో రాధా మీద విరుచుకుపడే గౌతం రెడ్డి ఈసారి మాత్రం ఆయనకే సీటు అని చెప్పడం విశేషం. గత ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌతమ్ రెడ్డి పోటీచేసి ఓడిపోయారు. అయితే ఈసారి సెంట్రల్ సీటు రాధాకేనని గౌతమ్ రెడ్డి స్వయంగా చెప్పడం విశేషం. రాధాతో కలిసి తాను పనిచేస్తానని చెప్పారు. రంగా, రాధాలపై తాను చేసిన వ్యాఖ్యలు మరిచిపోవాలని ఆయన సూచించారు. తాను ఇక్కడ వైసీపీ విజయం కోసం కృషి చేస్తానని గౌతమ్ చెప్పారు. మొత్తం మీద బెజవాడలో నేతల మధ్య ఉన్న విభేదాలకు స్వయంగా అధినేత జోక్యంతోనే సమసిపోయిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి సెంట్రల్ నియోజకవర్గం రాధాకు హామీ ఇస్తే మల్లాది విష్ణు సంగతేంటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది.
Leave a Reply