
మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం ధారపోసే లక్షలమంది వీరాభిమానుల్లో దిలీప్ కళ్యాణ్ సుంకర ఒకరు. భీమవరం బుల్లోడు అయిన కళ్యాణ్ మంచి వక్త. అనర్గళంగా ఏ అంశం అయినా ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం లేకుండా కౌంటర్లు పంచ్ లతో విసిరి వారి నోరు మూయించే సత్తా వున్న యువకుడు. దిలీప్ కళ్యాణ్ వాక్చాతుర్యం కత్తి మహేష్ ఎపిసోడ్ లో తెలుగు రాష్ట్రాల్లో అందరికి తెలిసివచ్చింది. ఆ ఎపిసోడ్ లో తన వాదనలతో పాటు మహేష్ కత్తి తో పీకే అభిమానులు రాజీ కుదిరేలా ఒక లాజికల్ కంక్లూజన్ తన తెలివి తేటలతో ఇచ్చాడు దిలీప్. అలా కోట్లమందిలో తన ఐడెంటిటీని అతి తక్కువ సమయంలో చాటుకున్నాడు కళ్యాణ్. సమకాలీన రాజకీయాలను ఔపోసన పట్టి అద్భుత ప్రతిభా పాటవాలతో జనసేన మౌత్ పీస్ గా టివి చర్చల్లో ప్రముఖ పాత్ర తో రాణిస్తాడని జనసైన్యం భావించారు కూడా. ఆ దశలో దిలీప్ పై కుట్ర మొదలైంది. జనసేనాని కి దిలీప్ ఎక్కడ దగ్గరౌతారో అన్న ఆందోళన పవన్ కోటరీ లో బయల్దేరింది అని జనసైనికులు చెబుతున్నారు. అలా మొదలైన కోటరీ ఆలోచనలు దిలీప్ కి చెక్ పెట్టె ఎత్తుగడలు రూపొందించి టివి చర్చల్లో అతనికి జనసేన తరపు ఆహ్వానించడానికి వీలు లేదంటూ అధికారికంగా చెప్పేశారు. ఆ అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ముఖ్యంగా జనసేన వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అసలు దిలీప్ పై జనసేన వేటు వేయడాన్ని పవన్ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. యూట్యూబ్, ఫేస్ బుక్, జనసేన అభిమానులు క్రియేట్ చేసిన పేజ్ లలో చర్చలు రచ్చ రచ్చగా సాగుతున్నాయి.
అసూయే అంత పని చేసిందా …?
పార్టీ ఏదైనా అవతలి వారు ఏ స్థాయి వ్యక్తి అయినా అది చివరికి మీడియా అయినా నిర్మొహమాటంగా జంకు లేకుండా కళ్యాణ్ దిలీప్ మాటల దాడి చేస్తాడు. మూడు పదుల వయస్సులో ఇంతటి పరిణితితో కళ్యాణ్ సాగించే మాటల యుద్ధం పవన్ కోటరీలో కొందరికి అసూయ కలిగేలా చేసిందని అంటున్నారు. దాంతో దిలీప్ కి పార్టీ కార్యాలయంలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ముందు చేయగలిగారు. ఆ తరువాత అనేక వివాదాలు అతడిపై సృష్ట్టించడం తో బాటు దిలీప్ కు అడ్డుకట్ట వేయడానికి ఛానెల్స్ చర్చ కార్యక్రమాల్లో పార్టీ తరపున పాల్గొనడానికి 8 మంది బృందాన్ని ఎంపిక చేశారు. ఇక్కడి దాకా బానే వుంది. రేటింగ్ కారణంగా ప్రముఖ ఛానెల్స్ అన్ని జనసేన ఎంపిక చేసిన 8 మంది ని పక్కన పెట్టి కళ్యాణ్ దిలీప్ నే ఆహ్వానిస్తున్నాయి. ఇది పవన్ కోటరీకి ఆగ్రహం తెప్పించిందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. దాంతో వేణు అనే పీఆరో ఓ స్వయంగా ఛానెల్స్ కి ఫోన్ చేసి జనసేన తరపున అధికారికంగా నియమించిన వారిని కాకుండా కళ్యాణ్ దిలీప్ ను పిలవడాన్ని తప్పు పట్టారు. ఆ విషయం తెలియడంతో మనస్థాపానికి గురైన కళ్యాణ్ దిలీప్ జనసేన కార్యకలాపాలకు, ఆపార్టీ తరపు చర్చల్లో పాల్గొనడానికి గుడ్ బై కొడుతున్నట్లు ప్రకటించారు.
వైరల్ అవుతున్న దిలీప్ వీడియో లు …
ప్రాణంతో సమానంగా ప్రేమించిన పార్టీ పొమ్మనడంతో కళ్యాణ్ దిలీప్ సుంకర హర్ట్ అయ్యాడు. తన వేదనను ఫెస్ బుక్ యూట్యూబ్ ద్వారా జనసేన అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పడు ఆ వీడియో నెట్ లో హల్చల్ చేస్తుంది. ఎక్కడ తనకు పవన్ టికెట్ ఇస్తారో అనే భయంతోనే కొందరు కుట్ర చేశారంటూ దిలీప్ ఆరోపణలు గుప్పించాడు. వారి అందరి జాతకాలు తనదగ్గర ఉన్నాయని సమయం వచ్చినప్పుడు తేల్చేస్తా అంటూ హెచ్చరించాడు. జనసేన పార్టీ పవన్ కోటరీ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడంతో బాటు అభ్యంతరకర భాషతో ఒక్కొక్కర్ని తిట్టిపోశాడు. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే ఈ వీడియో తో బాటు గతంలో కళ్యాణ్ దిలీప్ ఒక ఛానెల్ ఎండి, మరో టాప్ ఛానెల్ సీఈఓ లను బండబూతులు తిట్టిన వీడియో లు వైరల్ అయిపోయాయి.
కళ్యాణ్ వెళ్ళే పార్టీ ఏది …?
దిలీప్ కళ్యాణ్ సుంకర ఇప్పుడు జనసేన కోటరీపై పగతో రగిలిపోతున్నారు. ఆయన కుటుంబం అత్యంత ఇష్టపడేది వైఎస్ రాజశేఖర రెడ్డిని. ఆయన వల్ల తన తండ్రికి ఉద్యోగ రీత్యా రావలిసిన బెనిఫిట్స్ అందాయని చెబుతున్నారు. మరోపక్క టిడిపి పశ్చిమ నేతలతోనూ కళ్యాణ్ కి సన్నిహిత సంబంధాలు వున్నాయి. ఆ పార్టీ వైపు వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. గత నాలుగేళ్లుగా జనసేన పార్టీని నమ్ముకుని ఎందరికో టార్గెట్ అయిన దిలీప్ కళ్యాణ్ సుంకర ఇప్పుడు తన అభిమాన హీరో కు ఎదురు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో ఛానెల్స్ వేదికగా సోషల్ మీడియా లోను ప్రచారం దుమ్ము రేపుతారా ? అనేది త్వరలోనే తేలనుంది. రాజకీయంగా అవకాశం వస్తే పార్టీ ఛానెల్స్ బండారం రోడ్డెక్కించేస్తా అంటూ గతంలో కళ్యాణ్ దిలీప్ ఆయుధాలు కలిగి ఉన్నాడంటూ ఒక కేసులో ఇరికించిన సందర్భంలో వ్యాఖ్యలు చేశారు. దాని ప్రకారం తన గళంతో ఒక ఎమ్యెల్యే కావాలన్న ఆయన కల నెరవేరేందుకు ఏ పార్టీ అవకాశం కల్పిస్తుందో చూడాలి.
Leave a Reply