
విశాఖ మాజీ మేయర్, మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి ఏ పార్టీలోకి వెళ్లనున్నారు? హరిని ఏపార్టీ దరిచేరుస్తుంది. విశాఖ రాజీకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న సబ్బం హరి టీడీపీలో చేరతారా? లేక కమలదళంలో కలిసిపోతారా? ఇదే ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్. సబ్బం హరి దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు. రాష్ట్ర విభజన సమయంలో తన గళాన్ని విన్పించిన సబ్బం హరి తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. అయితే కొన్నాళ్ల తర్వాత జగన్ తో విభేదాలు తలెత్తడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. జగన్ పై విమర్శలు చేసినా ఈ మధ్య కాలంలో సైలంట్ గా ఉన్నారు. 2014 తర్వాత సబ్బం హరి స్వరం విన్పించడం లేదు. సబ్బం హరికి విశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంది. మేయర్ గా ఆయన వివాదరహితుడిగా పేరుపొందారు. అలాంటి సబ్బం హరిని తమ పార్టీలోకి చేర్చుకోవాలని ఇటు టీడీపీ, అటు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ అయితే ఒక కండిషన్…..
అయితే సబ్బం హరి బీజేపీలో చేరేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. అనకాపల్లి నియోజకవర్గం ఎంపీ టిక్కెట్ ను వచ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తే అందులోకి వెళ్లేందుకు సబ్బం హరి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆయన సన్నిహితులు ఈ విషయాన్ని బహిరంగంగా చెబుతున్నారు. 2014 ఎన్నికల తర్వాత సబ్బం హరి ఎక్కడా కన్పించడం లేదు. అయితే టీడీపీ సబ్బం హరిని పార్టీలోకి తీసుకునేందుకు సిద్ధమయింది ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కూడా మధ్యవర్తుల ద్వారా చంద్రబాబు కబురు పంపారు. విశాఖ నగరంలో కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన సబ్బం హరిని పార్టీలో చేర్చుకుంటే ప్లస్ అవుతుందని భావించి టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది. కాని ఎందుకో సబ్బం హరి టీడీపీలో చేరేందుకు ఇష్టపడలేదు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా అంగీకరించలేదు. సబ్బం హరికి పార్లమెంటు సభ్యుడిగా చేయలన్న కోరికే అధికంగా ఉండటంతో ఎమ్మెల్సీ పదవిని నిరాకరించినట్లు చెబుతున్నారు. అయితే బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కొంత ఫలితాలు ఇస్తున్నాయంటున్నారు. అనకాపల్లి టిక్కెట్ ఈ సారి పొత్తులో భాగంగా తమకు ఇవ్వాలని బీజేపీ టీడీపీని కోరనుంది. అనకాపల్లి పార్లమెంటరీ స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి వస్తే సబ్బం హరి కాషాయ కండువా కప్పుకున్నట్లేనంటున్నారు. మొత్తం మీద ఉత్తరాంధ్రలో పట్టు పెంచుకునేందుకు ఇటు బీజేపీ, అటు టీడీపీ బాగానే ప్రయత్నిస్తున్నాయి. అయితే సబ్బం హరి ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తిగా మారింది.
Leave a Reply