
టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్.. ఏపీ విభజన సమస్యలపై గళం విప్పి లోక్‌సభ దద్దరిల్లేలా మాట్లాడారు. అప్పటి వరకు ఏపీ సమస్యలపై చిన్న చూపు చూసిన కేంద్రం కూడా గల్లా ప్రసంగంతో ఆలోచనలో పడింది. అసలు ఎందుకు గోల అనుకుంటూ.. ఆయా సమస్యలపై హుటాహుటిన కేంద్రం స్పందించేందుకు అవకాశం ఏర్పడింది. ప్రధానంగా కేంద్రానికి ఏపీకి మధ్య సమస్యగా మారిన భాష విషయంలో గల్లా హద్దులు చెరిపేశారు. తనకున్న ఇంగ్లీష్ పరిజ్ఞానాన్ని పరిపూర్ణంగా వినియోగించుకున్నారు. దాదాపు 18 నిముషాల పాటు లోక్‌సభలో అనర్గళంగా ఏపీ సమస్యలపై ఎలుగెత్తారు. అంతేకాదు, సమస్యలు వివరిస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలకు సూటి ప్రశ్నలు సంధించారు. మీకు మేం కావాలో .. అవినీతితో అంటకాగేవారు కావాలో తేల్చుకోండంటూ అల్టిమేటం జారీ చేశారు.
జాతీయ మీడియాను సయితం…
ఈ పరిణామం ఒక్కసారిగా జాతీయ మీడియాను సైతం ఆకర్షించింది. గల్లా ప్రసంగం అద్భుతః అని కొనియాడింది. ఆయన లేవనెత్తిన అంశాలపై జోరు ప్రచారం సాగింది. తెలుగు పత్రికలు కూడా అదేవిధంగా స్పందించాయి. ఇక, టీడీపీలోనూ నేతలు ఎంపీ గల్లా బెటర్ అంటూ కొనియాడారు. సీఎం చంద్రబాబు కూడా ఇకపై ఏ సమస్య వచ్చినా కేంద్రంతో మాట్లాడేందుకు గల్లా వాణిని వినియోగించుకోవాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఈ పరిణామాలను నిశితంగా గమనించిన ఇద్దరు టీడీపీ ఎంపీలు.. గల్లాకు అంత ప్రాధాన్యం అవసరమా? అనే ధోరణిలో ఉండడం గమనార్హం. అంతేకాదు.. గల్లాకు బ్రహ్మరథం పట్టడాన్ని కూడా వారు జీర్ణించుకోలేక పోతున్నారు. తామంతా పార్లమెంటు లోపల, బయట నానా తిప్పలు పడి నిరసన వ్యక్తం చేశామని, స్పీకర్‌తో తిట్లు కూడా తిన్నామని అంటున్నారు.
ఒక్క గల్లా వల్లమాత్రమే కాదంటూ…
అంతేకాదు, ఏపీ కోసం మనసు చంపుకుని బీపీ, షుగర్ వంటి సమస్యలను సైతం పక్కకు పెట్టి మరీ పార్లమెంటు వీధుల్లో గంటల కొద్దీ నిలబడి ఆందోళన చేశామని అయితే.. ఇప్పుడు గల్లా మాత్రమే ఏపీకి ఏదో చేశాడని కొనియాడడం ఎంత మేరకు సమంజసమనే వాదనను తెరమీదకి తెస్తున్నారు. కేంద్రం దిగివచ్చిందంటే.. అది ఒక్క గల్లా వల్ల మాత్రమేనని అంటే.. ఇక తామెందుకని కూడా ఓ ఇద్దరు ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణలు గల్లాకు బ్రహ్మరథం పట్టడంపై మండిపడుతున్నారు. వేరేవేరే వారు గల్లాను పొగిడారంటే అర్ధం చేసుకోవచ్చు.. కానీ సాక్షాత్తూ సీఎం చంద్రబాబే.. గల్లాను ఓ క్లీన్ లీడర్‌గా చూడడం ఎంతమేరకు సమంజసమని కొనకళ్ల ప్రశ్నించారట. ఇప్పుడు ఈ విషయం టీడీపీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
అందుకే గైర్హాజరయ్యారా?
ఆదివారం సీఎం చంద్రబాబు తనకు అందుబాటులో ఉన్న ఎంపీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కేశినేని నాని, కొనకళ్ల నారాయణ గైర్హజరయ్యారు. విజయవాడలో ఉన్నప్పటికీ కేశినేని నాని సమావేశానికి రాలేదు. గల్లా జయదేవ్‌కు అనవసర ప్రాధాన్యం ఇస్తున్నారన్న అసంతృప్తితోనే వీరు సమావేశానికి గైర్హాజరైనట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి వర్గీయులుగా ముద్రపడిన కేశినేని, నారాయణరావు సమావేశానికి రాకపోవడంపై టీడీపీలోనూ చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఇది ఏవిధంగా మారుతుందో చూడాలి.
Leave a Reply