డ్రాగన్ దూకుడుకు కళ్లెం వేయలేమా?

దక్షిణ చైనా సముద్ర వివాదం అమెరికా- చైనా మధ్య అగాధాన్ని పెంచుతోంది. మాటల యుద్ధానికి దారితీస్తోంది. తరచూ ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఈ విషయమై అమెరికా చైనా వైఖరిని ఖండిస్తూ ప్రకటన చేయడం కీలక పరిణామం. దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ దీవుల ఏర్పాటు, వాటిలో నిర్మాణాలను చేపట్టడాన్ని ఖండించింది. ఈ విషయమై అమెరికాకు జతగా జపాన్, ఆస్ట్రేలియాలు నిలిచాయి. అమెరికా మిత్ర దేశాలుగా వీటికి పేరుంది. జపాన్ తో చైనాకు వైరముంది. అమెరికా ప్రకటనతో చైనా అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది. సుద్దులు చెప్పడం మానాలి, ఈ ప్రాంత వ్యవహారాల్లో వేలు పెట్టరాదని పరోక్షంగా చైనా హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంత వివాదంపై తనతో విభేదిస్తున్న ఆగ్నేసియా దేశాల సంఘాన్ని మెత్త బడేట్లు చేయడం తాజా పరిణామం. ఇది ఒక రకంగా చైనాకు సానుకూల అంశం. సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్, బ్రూనే, వియత్నాం, కంబోడియా, లావోస్, ఫిలిప్పీన్స్, మయన్మార్ లు ఆసియన్ సభ్య దేశాలు. ఈ కూటమి ఇటీవలే 50 వ వసంతంలోకి అడుగుపెట్టడం గమనార్హం.

అసలు వివాదం ఏంటి?

దక్షిణ చైనా సముద్ర వివాదం గురించి చర్చించే ముందు దాని పూర్వాపరాలను గురించి తెలుసుకోవడం తప్పనిసరి. వాస్తవానికి దక్షిణ చైనా సముద్రం అంటూ ప్రత్యేకంగా అంతర్జాతీయ చిత్రపటంలో లేదు. ఇది పసిఫిక్ మహాసముద్రంలో అంతర్భాగమే. దక్షిణ చైనా సముద్రం చూనాదని, ఏ అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించలేదు. పసిఫిక్ మహాసముద్రంలో సింగపూర్ నుంచి నైరుతి దిశగా ముక్కా జలసంధిదాకా, ఈశాన్య తైవాన్ జలసంధిదాకా ఆంగ్ర అక్షరం ‘యు’ ఆకారంలో ఉన్న ప్రాంతాన్ని దక్షిణ చైనా సముద్రంగా వ్యవహరిస్తున్నారు. చైనాతీరానికి దక్షిణంగా 35 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సాగర జలాలపై ఆగ్నేయ ఆసియా దేశాల సంఘంలోని దైశాలైన వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూనే, తైవాన్ లు తమకూ హక్కుందని వాదిస్తున్నాయి. ప్రపంచ దేశాల సముద్ర వాణిజ్యంలో మూడింట ఒక వంతు ఈ సముద్రం ద్వారానే జరగడం దీని ప్రాధాన్యతకు నిదర్శనం. పశ్చిమాసియా నుంచి జపాన్ దిగుమతి చేసుకుంటున్న చమురులో దాదాపు 80 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతోంది. ఈ సముద్రంలో అపారమైన చమురు నిక్షేపాలున్నట్లు సర్వేలు రావడంతో దీనిపై చైనా కన్నేసింది. ఇక్కడికి సమీపంలోని స్పార్ట్ లీ, పాసెల్ దీవుల్లో ఖనిజ సంపద నిక్షిప్తమై ఉంది. దీంతో చైనా ఎలాగైనా మొత్తం ప్రాంతంపై పట్టుకోసం పరితపిస్తోంది.

భారత్ కు కూడా ఈ ప్రాంతం…..

భారత్ కు కూడా ఈ ప్రాంతం ముఖ్యమే. ఆసియా ఫసిఫిక్ లో భారత్ నౌకా వాణిజ్యంలో 55 శాతం ఈ మార్గం దార్వానే జరుగుతుంది. అందువల్ల ఈ ప్రాంతంలో తన ఉనికిని కాపాడుకోవడం భారత్ కు అవసరం. అంతర్జాతీయ నిబంధనల మేరకు తన తీరం నుంచి 12 వాటికన్ మైళ్ల వరకూ సముద్రంపై పూర్తి హక్కు ఉంటుంది. 200 వాటికన్ మైళ్ల వరకూ గల ప్రాంతాన్ని ఆర్థిక జల మండలంగా ప్రకటించుకునే వీలుంది. ఆర్థిక జల మండలంలో చేపలు పట్టుకునే హక్కు, సముద్ర సంపదను అన్వేషించుకునే హక్కు సంబంధిత దేశాలకే ఉంటుంది. ఇతర దేశాల నౌకలు ఆ యా జలాల మీదుగా ప్రయాణించే హక్కు కూడా ఉంది. అంతే తప్ప సముద్ర సంపదపై ఎలాంటి హక్కు ఉండదు. అంతర్జాతీయ నిబంధనలను ఇంత స్పష్టంగా ఉన్నా, ఆఖరకు అంతర్జాతీయ ట్రిబ్యునల్ ఖచ్చితమైన తీర్పు ప్రకటించిన తర్వాత కూడా డ్రాగన్ దుదుడుకు వైఖరిని ప్రదర్శించడం దాని తెంపరితనానికి నిదర్శనం.

చైనా సొత్తేమీ కాదంటున్న……..

దక్షిణ చైనా సముద్రాన్ని దూరంగా ఉంచాలని అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా కోరడం చైనాకు చిర్రెత్తించే పరిణామం. ఈ సముద్రం ఒక్క చైనా గుత్త సొత్తేమీ కాదని గత ఏడాది అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినప్పటి నుంచి డ్రాగన్ దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ట్రిబ్యునల్ తీర్పును పట్టించుకోమని బహిరంగంగానే చెప్పింది. అప్పటి నుంచి తీర తీర దేశాలను మచ్చిక చేసుకునే ప్రయత్నాల్లో మునిగి తేలుతుంది. అంతర్జాతీయంగా చూస్తే దక్షిణ చైనా సముద్రం అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఈ సముద్రం మార్గం మీదుగానే ఏటా రమారమి ఐదు లక్షల కోట్ల డాలర్ల నౌకా వాణిజ్యం జరుగుతోంది. ఈ సముద్రంలో అపారమైన చమురు సహజ వనరుల నిక్షేపాలు ఉన్నాయన్నది నిపుణుల అంచనా. ఈ వనరులను చేజిక్కించుకోవాలన్న దురాశ, దూరాలోచనతో యావత్ దక్షిణ చైనా సముద్రం తనదేనని వితండ వాదం చేస్తోంది. సముద్ర హక్కుపై ఫిలిప్పీన్స్ ఐక్యరాజ్యసమితి ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది. ఈ విషయమై గత ఏడాది తీర్పును వెలువరించిన ట్రిబ్యునల్ చైనాను తప్పుపట్టింది. అన్ని తీర దేశాలకు ఈ ప్రాంతంపై హక్కు ఉందని స్పష్టంగా పేర్కొంది. దక్షిణ చైనా సముద్ర దేశాలు ఈ విషయంలో చైనాను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఈ దేశాల్లో చీలిక తీసుకురావడానికి చైనా ప్రయత్నిస్తోంది. దౌత్య, ఆర్థిక మార్గాల ద్వారా వాటికి చేరువవుతోంది. తద్వారా వాటి వైఖరిలో కొంత మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ఓ సదస్సు సందర్భంగా ఆసియాన్ మంత్రులు విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. వివాదానికి సంబంధించి చర్చలపై చైనా విధివిధానాలకు ఈ దేశాలు మద్దతు ప్రకటించడం గమనార్హం. చైనా విషయమై సభ్య దేశాల మధ్య వైఖరిలో కూడా గణనీయమైన మార్పు కనపడుతోంది. చైనాకు వ్యతిరేకంగా వియత్నాం తన వాణిని గట్టిగా విన్పించగా, కంబోడియా బీజింగ్ కు అండగా నిలబడింది.

చైనా పరోక్ష హెచ్చరికలు…….

అయితే ఈ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని నేరుగా అడ్డుకోలేని అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ తీర దేశాలకు మద్దతుగా నిలిచేందుకు, వాటి తరపున వకాల్తా పుచ్చుకునేందుకు వస్తున్నాయి. భారత్ వంటి దేశాలను కూడా పరోక్షంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న చైనా ‘బయటివారు’ తలదూర్చొద్దని పరోక్షంగా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలను ఉద్దేశించి పేర్కొంటోంది. దక్షిణ చైనా సముద్ర వివాదంలో భారత్ వైఖరి కూడా డ్రాగన్ కు మింగుడు పడటం లేదు.అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్ సదస్సులో తన వైఖరి స్పష్టంగానే చెప్పింది. సముద్ర జలాలపై హక్కులకు సంబంధించి 1982 నాటి ఐక్యరాజ్య సమితి తీర్మానం, అంతర్జాతీయ నిబంధనలకు లోబడి తీర దేశాలు నడుచుకోవాలని పేర్కొనడం చైనాకు చెంపపెట్టులాంటిదే. భారత్ వైఖరి తీరదేశాలకు తిరుగులేని మద్దతు ఇస్తోంది. ఇప్పటికే వియత్నాంతో ఒప్పందంలో భాగంగా దక్షిణ చైనా సముద్రంలో చమురు వెలికితీత కార్యక్రమం చేపట్టింది. భారత్ కు చెందిన చమురు సహజ వాయు సంస్థ (ఓఎన్జీసీ) ఈ పనులను చురుగ్గా నిర్వహిస్తోంది. దీనిపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ తన వాదనను గట్టిగా విన్పించడం ద్వారా దాని నోరు మూయించింది. చైనాను వ్యతిరేకించే వియత్నాంతో కూడా న్యూఢిల్లీకి సత్సంబంధాలున్నాయి. ఇటీవల రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీ ఆ దేశంలో పర్యటించి వచ్చారు. మొత్తం మీద దక్షిణ చైనా సముద్ర వివాదంపై ఆసియాన్ దేశాల వైఖరిలో మార్పు తీసుకురావడం చైనా విజయమని చెప్పడంలో సందేహం లేదు.

Ravi Batchali
About Ravi Batchali 35928 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*