
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆయన 31 జల్లాల్లోనూ పర్యటించనున్నారు. ఎన్నికల సమరశంఖారావాన్ని పూరించనున్నారు. జూన్ 2వ తేదీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుగుతోంది. జూన్ 2వ తేదీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ఖరారు కావడంతో అప్పటిలోగా అన్ని జిల్లాల్లో రహదారులను మరమ్మతులు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. రహదారులను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్ ఆర్ అండ్ బీ అధికారులను హెచ్చరించారు. ఈ నెలాఖరులోగానే రోడ్లపై గుంతలను పూడ్చేయాలని, రోడ్లపై ఒక్క గుంత కన్పించినా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి. ఆర్ అండ్ బి శాఖకు రహదారి నిర్మాణాలకు, మరమ్మత్తుల కోసం అవసరమైన నిధులను బడ్జెట్ లో కేటాయించినా ఎందుకు పనులు ప్రారంభించలేదని నిలదీశారు.
గుంతలు కన్పిస్తే సస్పెన్షనే…..
ప్రగతిభవన్ లో ఈరోజు ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష చేశారు. మే నెలాఖరులోగా గుంతలన్నీ పూడ్చేయాలని ఆదేశించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రహదారుల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసినా పనులు నత్తనడకన నడుస్తుండటాన్ని ఆయన తప్పుపట్టారు. అధికారులు అలసత్వం వహిస్తే సహించనని చెప్పారు. తాను ఇటీవల వరంగల్ జిల్లాలో పర్యటించినప్పుడు వరంగల్ నుంచి పాలకుర్తి రోడ్డు లో అనేక గుంతలు కన్పించాయని, మరమ్మత్తులకు నిధులిస్తున్నా ఎందుకు పనులు చేపట్టడం లేదన్నారు. గుంతల వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నెల రోజులు టైమ్ ఇస్తున్నా…ఈలోపు గుంతలు పూడ్చకుంటే ఏ ఒక్క అధికారినీ వదిలిపెట్టేది లేదని కేసీఆర్ హెచ్చరించారు. గుంత కన్పిస్తే అక్కడికక్కడే సంబంధిత అధికారిని సస్పెండ్ చేస్తానన్నారు. స్టేషన్ ఘన్ పూర్ – పాలకుర్తి రోడ్డు కు వెంటనే మరమ్మత్తు పనులు చేపట్టాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే కార్యాలయాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం తన సమీక్షలో పేర్కొన్నారు.
Leave a Reply