నేడు నరేంద్రుడు..రేపు దేవేంద్రుడు?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దేశవ్యాప్తంగా ఒక నమూనా అయ్యారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటిన ఫడ్నవిస్ ను ఇటు బీజేపీ అటు ఆర్ఎస్ఎస్ నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రాబోయే తరానికి నవ నేతగా ఆయనను కమలనాధులు అభివర్ణిస్తున్నారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ స్థాయికి ఫడ్నవిస్ ఎదుగుతారన్న కామెంట్లు కూడా విన్పిస్తున్నాయి. అతి చిన్న వయసులో ఒక పెద్ద రాష్ట్రాన్ని పాలించడమే కాకుండా…తన దైన ముద్రతో ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఫడ్నవిస్ ప్రజల మన్ననలను పొందారంటున్నారు. బీజేపీ కిందిస్థాయి నుంచి వచ్చిన వారు దేశాన్నే పరిపాలిస్తున్నారనడానికి నరేంద్ర మోడీయే ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ భావాజలాన్ని పుణికిపుచ్చుకుని, ఏబీవీపీలోనూ విభిన్న స్థాయిల్లో పనిచేసిన ఫడ్నవిస్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందంటున్నారు. ఫడ్నవిస్ బీజేపీలో మూడోతరం నాయకుడిగా ఎదిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.

విద్యార్థి దశ నుంచే….
మహారాష్ట్రకు చెందిన దేవేంద్ర ఫడ్నవిస్ 1970 లో నాగపూర్ లోజన్మించారు. విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో చురుగ్గా పాల్గొనేవారు. దీంతో ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకు దగ్గర సంబంధాలున్నాయి. దీంతోపాటు బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘమైన ఏబీవీపీలో కూడా ఫడ్నవిస్ తన సేవలందించారు. తర్వాత నాగపూర్ లో జరిగిన స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి 21 ఏళ్ల వయస్సులోనే కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 1997 లో నాగపూర్ మేయర్ పదవిని కూడా ఫడ్నవిస్ చేపట్టారు. దేశంలోనే అతి చిన్న వయస్సులో మేయర్ అయిన వ్యక్తి ఫడ్నవిస్. వరుసగా నాలుగు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. ఫడ్నవిస్ పనితీరును గుర్తించిన కమలనాధులు ఆయనను మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో ఏమీ ఆలోచించకుండా ఫడ్నవిస్ నే ముఖ్యమంత్రిని చేశారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఫడ్నవిస్ వమ్ము చేయకుండా…స్థానికసంస్థల ఎన్నికల్లో తన దమ్ము చూపారు. ఫడ్నవిస్ సేమ్ టు సేమ్ నరేంద్ర మోడీ దారిలోనే పయనిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. చిన్న వయస్సులోనే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారంటే…ఫడ్నవిస్ ప్రతిభ గురించి వేరే చెప్పక్కరలేదు. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తుంటే…దేశంలో అత్యున్నత పదవిని అధిష్టిస్తారనడంలో సందేహం లేదంటున్నారు.

యంగ్ అండ్ డైనమిక్….
దేవేంద్ర ఫడ్నవిస్ ను మహారాష్ట్ర సీఎంగా చేయాలనుకున్నప్పుడు మోడీ టీంకు అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. సీనియర్లను కాదని యువకుడికి ఎలా అతి పెద్ద రాష్ట్రాన్ని అప్పగిస్తారన్న ప్రశ్నలూ ఉదయించాయి. అయితే మోడీ మాత్రం క్లీన్ ఇమేజ్ ఉన్న ఫడ్నవిస్ వైపే మొగ్గు చూపారు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అనేక కుంభకోణాలనూ వెలికి తీశారు ఫడ్నవిస్. అందుకే ఫడ్నవిస్ నా ఛాయిస్ అన్నారు మోడీ. అప్పట్లో ఏక్ నాధ్ ఖాడ్సే, సుధీర్ ముంగంటివార్, నితిన్ గడ్కరీ వంటి సీనియర్ నేతలు సీఎం కుర్చీకోసం పట్టుబట్టినా.. బీజేపీ నాయకత్వం మాత్రం ఫడ్నవిస్ పై నమ్మకముంచింది. ఫడ్నవిస్ కూడా అతి పెద్ద రాష్ట్రం, ధనిక రాష్ట్రం, అనేక సంస్కృతులు కలగలసి ఉన్న మహారాష్ట్రలో కమల వికాసానానికి పాటుపడ్డారు. ఈ యంగ్ లీడర్ కు మంచి రాజకీయ భవిష్యత్ ఉందని ఆశిద్దాం..

Ravi Batchali
About Ravi Batchali 41252 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*