
తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన టీడీపీ ముఖ్యనేతలు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి జన్మభూమి కార్యక్రమం ప్రారంభమవుతుండటంతో ఆయన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నేతలతో మాట్లాడారు. అయితే ఇటీవల ఏలూరు ఎంపీ మాగంటి బాబు కార్యాలయంలో పేకాట జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే కోడిపందేలు కూడా సంక్రాంతికి జరుపుతామని కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేశారు.
మాగంటిని ఉద్దేశించేనా?
దీంతో చంద్రబాబు పరోక్షంగా మాగంటి బాబుకు హెచ్చరికలు జారీ చేశారు. కోడిపందేలు, జూదాల విషయంలో హద్దులు దాటవద్దని అన్నారు. జూదాల వల్ల పార్టీకి చెడ్డపేరు వస్తుందని, జూదాలను ప్రోత్సహించేవారిని తాను ఉపేక్షించబోమని చంద్రబాబు నేతలకు సుస్పష్టంగా చెప్పారు. ఇక నియోజకవర్గాల వారీగా తాను గ్రేడింగ్ లు సిద్ధం చేస్తున్నానని, అక్కడ ఎమ్మెల్యేల పనితీరును బట్టి ఏ,బీ,సీ గ్రేడ్లుగా ఇస్తామన్నారు. పనితీరు బాగాలేని చోట అభ్యర్థులను మార్చటానికి కూడా వెనకాడబోనని చంద్రబాబు గట్టిగా నేతలకు హెచ్చరికలు జారీ చేశారు.
పార్టీ కార్యాలయాలు సిద్ధం చేయాలి….
2018 నాటికి నియోజకవర్గాల్లో పార్టీ కార్యాలయాలు సిద్ధం చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలన్నారు. అలాగే వచ్చే నెల 2వ తేదీ నుంచి జరగనున్న జన్మభూమి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పనిచేయాలన్నారు. అలాగే అర్హులైన లబ్దిదారులందరికీ పథకాలు వర్తించేలా చూడాలని ఆయన టీడీపీ నేతలను కోరారు. కాని ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు చేసిన కఠిన వ్యాఖ్యలు నేతలను విస్మయపరిచాయి.
Leave a Reply