పంతం కాదు…ప్రతిష్ఠ ముఖ్యం

రాజకీయాల్లో , పరిపాలనలో దీర్ఘకాలం నిలిచే మన్నికైన సరుకే ప్రతిష్ఠ. శాశ్వతమైన చిరయశస్సును పంచేది, ప్రజల్లో పదికాలాలపాటు నిలిచేది కూడా ప్రతిష్ఠే. అయితే పంతాలు, పట్టుదలలు దాని స్థానాన్నిఆక్రమించి తాత్కాలికంగా విర్రవీగవచ్చు. ఏదో సాధించేశామని భ్రమించవచ్చు. కానీ అది అశాశ్వతం. నీటి బుడగ.

తాజాగా దేశంలో అత్యున్నతస్థాయిలో చోటు చేసుకున్న కీలకపరిణామం సామాన్యుల దృష్టిలో పెద్దగా పడకపోయినా ప్రజాకర్షణ,పదవీ వ్యామోహాల్లో చిక్కుకున్న పెద్దలకు మాత్రం పెద్ద కనువిప్పు. దేశం మొత్తాన్ని పట్టికుదిపేసిన డీమోనిటైజేషన్ ప్రభావం, పర్యవసానాలు, ఈ నిర్ణయానికి గల కారణాలు వంటి అంశాలపై చట్టసభలోని అత్యున్నత ఆర్థిక కమిటీ వివరాలు సేకరించాలని భావించింది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ ను తమ ముందు హాజరై వివరణ ఇవ్వమని ఆదేశించింది. ఇందులో కొంత రాజకీయమూ దాగి ఉంది. డీమోనిటైజేషన్ అనే మహత్తర ప్రక్రియ అందించే ఫలాలను , ప్రచారాన్ని పూర్తిగా తనకే సొంతం చేసుకోవాలని భావించారు భారతప్రధాని. దాంతో అసలు డీమోనిటైజేషన్ ను సిఫారసు చేయాల్సిన రిజర్వు బ్యాంకు పాలకమండలిని కానీ, దానిని అమలు పరచాల్సిన యంత్రాంగాన్ని కానీ పక్కనపెట్టి , సర్వం సహా తానే దీనికి బాధ్యుడిని అన్నట్లుగా ప్రకటన చేశారు. ఈవిషయాన్ని పక్కా రాజకీయం చేసే అవకాశం విపక్షాలకు కలిసి వచ్చింది. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తో కూడిన వ్యవస్థ మనది. అందుకే డీమోనిటైజేషన్ నిర్ణయంలో చోటు చేసుకున్న తప్పిదాలను, విధానపరమైన లోపాలను, ప్రభుత్వ పెత్తందారీ పోకడలను ఎండగట్టేందుకు పార్లమెంటరీ కమిటీ రంగంలోకి దిగింది. ప్రధాని నరేంద్రమోడీని , ఎన్డీయే ప్రభుత్వ వైఖరిని తూర్పారబట్టేందుకు ఉర్జీత్ పటేల్ ను ఉతికి ఆరేసేందుకు సిద్ధమైంది.

ఆ కమిటీలో ప్రఖ్యాత ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా సభ్యులే. ఇంకేముంది ఉర్జిత్ పని అయిపోయినట్టే అని అందరూ భావించారు,కానీ ఉర్జిత్ రిజర్వు బ్యాంకు గవర్నర్,  దేశ ఆర్థిక వ్యవస్థ నియంత్రణలో కీలక భూమిక పోషించే కేంద్ర బ్యాంకు ప్రతిష్ఠకు ప్రతీక. అందుకే గతంలో అదే స్థానంలో బాధ్యత నిర్వహించిన మన్మోహన్ అత్యంత విచక్షణతో వ్యవహరించారు. ఇబ్బందికరమైన ప్రశ్నలకు , భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంకు ప్రతిష్ఠకు ఇబ్బందికలిగించే అంశాలకు సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ ఉర్జీత్ ను వెనకేసుకొచ్చారు మన్మోహన్ . ఒక రకంగా చెప్పాలంటే ఉర్జీత్ ను ఇరకాటం నుంచి బయట పడేశారు. పరోక్షంగా ప్రధాని ప్రతిష్ఠ కూడా మంటగలిసి పోకుండా చూశారు. ఈ రెండు పదవులూ గతంలో నిర్వహించిన మన్మోహన్ ఆయా పదవులకున్న పవిత్రత, గురుతర బాధ్యత ఎంతటి మహోన్నతమైనవో తెలిసిన వాడు కాబట్టే ఇంతటి ఔదార్యం ప్రదర్శించారు.

నరేంద్రమోడీ వంటి ఔత్సాహికుడు తాను చేయాలనుకున్న పనిని ఆయా వ్యవస్థల ద్వారా చేయించకుండా, మొత్తం క్రెడిట్ కొట్టేయాలని చూస్తే ఎదురయ్యే ఇబ్బందులేమిటన్న విషయం ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదనే విమర్శలు, విలువైన సూచనలూ వెలువడుతున్నాయి. వాటిని పాటించి ఎవరి పనిని వారిని చేయనిస్తే ..అందులోనూ పద్దతిగా ఏ సంస్థ ద్వారా జరగాల్సిన కార్యాన్ని వారి చేతులమీదుగానే పూర్తి కానిస్తే వ్యవస్థకు మేలు. అన్నిటికీ తానే అన్నట్లుగా అధికారం ఉంది కదా? అని అనాలోచితంగా వ్యవహరిస్తే .. ఆయా సంస్థల ప్రతిష్ఠ మట్టికట్టుకుపోతే ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిపోతే పునరుద్ధరించేదెవరు? ఇప్పుడు అమెరికాలో కూడా ఈ అధ్యక్షుడు మాకు వద్దు అంటూ ఆందోళనలు సాగుతున్నాయి. అది అగ్రదేశపు అధ్యక్ష పదవి. ప్రపంచాన్ని శాసించే పలుకుబడి,సొంత ఇంట్లో పలచనైతే పరువు బజారున పడుతుంది. రాజ్యాంగసూత్రాల ప్రకారం, ఎన్నికైన అధ్యక్షుడిని రోడ్డుకీడ్చడం ఎంతసమంజసమో ఆందోళన కారులు కూడా గుర్తెరగాలి. లేకుంటే వ్యక్తుల కు వ్యతిరేకంగా చేపట్టే నిరసనలు వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. సో ఇనిస్టిట్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్… వ్యక్తులు కాదు వ్యవస్థలే శాశ్వతం. ఉన్నతపదవులు చేపట్టే వారు దీనిని గుర్తించడం మరింత అవసరం.

1 Comment on పంతం కాదు…ప్రతిష్ఠ ముఖ్యం

Leave a Reply

Your email address will not be published.


*