పాత కాన్సెప్ట్ జగన్ కు సక్సెస్ తెస్తుందా?

అనుకరణను ఎప్పుడూ ప్రజలు పాజిటివ్ గా రిసీవ్ చేసుకోరు. అనుకరణ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండక పోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ తలపెట్టిన పాదయాత్ర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ కొత్తదనం వెతుక్కోకుండా పాదయాత్ర చేపట్టడంపై ఆ పార్టీ నేతలే కొందరు పెదవి విరుస్తున్నారు. వచ్చే నెల6వ తేదీ నుంచి జగన్ పాదయాత్ర ఇడుపుల పాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ ఆరు నెలల పాటు సాగనుంది. మొత్తం 3000 కిలోమీటర్లు 125 నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అయితే జగన్ పాదయాత్ర వల్ల వైసీపీకి మైలేజీ చేకూరుతుందా? జగన్ కు ప్రజల్లో ఇమేజీ పెరుగుతుందా? అన్న సందేహం తలెత్తుతోంది. ఎందుకంటే ఏపీ ప్రజలకు పాదయాత్రలు పెద్ద కొత్తేమీ కాదు. పాదయాత్రల వల్లనే అధికారంలోకి వచ్చామని ఖచ్చితంగా కూడా చెప్పలేం. అలాంటి పరిస్థితుల్లో పాదయాత్రతో జగన్ సక్సెస్ అవుతారా? లేదా? అన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే ఉన్నాయి. బయటకు చెప్పకున్నా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నారు.

పాదయాత్ర వల్లనే విజయం సాధించారా?

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి జనం లోకి వెళ్లారు. దాదాపు 9 నెలల పాటు రాష్ట్రమంతటా పర్యటించారు. అది పాదయాత్ర కాదు. రథయాత్ర. అయితేనేం ఎన్టీఆర్ ను చూసేందుకు అప్పట్లో ప్రజలు రోజుల తరబడి చూసేవారు. అప్పటి వరకూ నేతలెవ్వరూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకపోవడం వల్లనే ఎన్టీఆర్ సక్సెస్ కాగలిగారు. తర్వాత అదే ఎన్టీఆర్ పార్టీ కాంగ్రెస్ చేతిలో చిత్తుగా ఓడింది. అప్పుడు కాంగ్రెస్ నేతలెవరూ పాదయాత్రలు చేయలేదు. తర్వాత మళ్లీ ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మండుటెండలో… ఆ వయస్సులో పాదయాత్ర చేయడంతో వైఎస్ కు ప్రజల్లో ఇమేజ్ అమాంతం పెరిగింది. ఎండనకా… వాననకా తమ కోసం వచ్చిన నేతను అక్కున చేర్చుకున్నారు. కాని కేవలం వైఎస్ పాదయాత్ర వల్లనే అధికారంలోకి రాలేదు. అప్పటి వరకూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలించడం, పాదయాత్ర రెండూ కలిసే వైఎస్ సీఎం కాగలిగారు. తర్వాత చంద్రబాబు కూడా 65 ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పాదయాత్ర వల్లనే ఏపీలో విజయం సాధించారంటే అది ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే అదే పాదయాత్ర తెలంగాణలోనూ చేశారు. కాని తెలంగాణాలో పాదయాత్ర వర్క్ అవుట్ కాలేదు. కాని ఏపీలో మాత్రం కొత్త రాష్ట్రం, మారిన రాజకీయ సమీకరణాలు, పొత్తులు అన్నీ కలిసి వచ్చి చంద్రబాబు సీఎం అయ్యారన్నది వాస్తవం. రెండు పార్టీలకు మధ్య తేడా కొద్దిపాటి శాతమే కావడంతో పాదయాత్ర చంద్రబాబుకు కూడా పెద్దగా కలసిరాలేదనే చెప్పుకోవాలి. చంద్రబాబుపాదయాత్ర కారణంగానే సీఎం తాను అయ్యానని చంద్రబాబు కూడా అంతర్గతంగా అంగీకరించరు. పాదయాత్ర ఇప్పుడు ఏపీలో సర్వసాధారణమైంది. అలాంటిది జగన్ యువకుడు. మూడు వేల కిలోమీటర్లు నడవడం పెద్ద కష్టమేమీ కాదు. పెద్దగా ప్రజల నుంచి సానుభూతి వచ్చే అవకాశమూ తక్కువే. అలాంటి పాత పాదయాత్ర కాన్సెప్ట్ తో జగన్ జనం ముందుకు వెళ్లి సక్సెస్ అవుతారా? లేక బోల్తా పడతారా? అన్నది తేలాల్సి ఉన్నా… ఒక్కటి మాత్రం వాస్తవం. పాదయాత్రతో క్యాడర్ లో జోష్ నింపే అవకాశాలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. క్యాడర్ లో ఉత్సాహం నింపి, నేతల్లో విభేదాలను తొలగించుకోవడానికి ఈ నడక ఉపయోగపడుతుందన్నది విశ్లేషకుల అంచనా. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

Ravi Batchali
About Ravi Batchali 23857 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*