పాదయాత్రకు ముందే జగన్ ను బాబు అణగదొక్కుతారా?

వైఎస్ జగన్ ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాలనూ ప్రభుత్వం ముందుగానే అమలు చేసేస్తుందా? జగన్ కు ఆ ఛాన్స్ , క్రెడిట్ దక్కకుండా చంద్రబాబు వాటిని ముందుగానే అమలు చేసే పనిలో ఉన్నారా? అవును. నిజమే. ఇప్పటికే జగన్ ప్లీనరీలో ప్రకటించిన తొమ్మిది పథకాల్లో రెండింటిని ఇప్పటికే అమల్లోకి తెచ్చారు చంద్రబాబు. మిగిలినవి కూడా తొందర్లోనే అమల్లోకి తెస్తారని, తమ పథకాలను కాపీ కొట్టి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుందామన్నా కుదరదని చెబుతున్నారు వైసీపీ నేతలు. అక్టోబర్ నెలలో జగన్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈలోపే ప్రభుత్వం జగన్ ప్రజలకు ప్లీనరీలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. దీంతో ప్లీనరీలో కన్పించిన జోష్ వైసీపీలో క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

నవరత్నాల్లో రెండింటికి ఆమోదం…..

ముఖ్యమంత్రి చంద్రబాబు జగన్ ప్రకటించిన తొమ్మిది పథకాల్లో ఒకటి ఆల్ రెడీ అమల్లోకి తెచ్చారు. బెల్ట్ షాపుల నిషేధంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఐదు ఫైళ్లలో ఒక సంతకం బెల్ట్ షాపులను నిషేధించే ఫైలు మీదే. అయితే మూడేళ్లు దాటినా….ఫైలు పై సంతకం చేసినా అది అమలుకు నోచుకోలేదు. బెల్ట్ షాపులపై ఇటీవల మహిళలు కూడా ఉద్యమ బాట పట్టారు. ఈనేపథ్యంలో జగన్ ప్లీనరీలో తాము అధికారంలోకి వస్తే దశల వారీగా మద్యనిషేధాన్ని అమలు పరుస్తామన్నారు. అందులో భాగంగా బెల్ట్ షాపులను వెంటనే రద్దు చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బెల్ట్ షాపులపై ముఖ్యమంత్రి ఒకసారి సంతకం చేసినా…మళ్లీ నిర్ణ‍యం తీసుకోవడాన్ని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. అలాగే జగన్ ప్లీనరీలో కిడ్నీ బాధితులకు నెలకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రభుత్వం తాజాగా ఉద్దానం కిడ్నీ బాధితులకు నెలకు రూ.2500ల పింఛనును మంజూరు చేయడాన్ని కూడా వైసీపీ ఈ సందర్భంగా గుర్తుకు తెస్తోంది.

వైసీపీలో కలవరం…

వైసీపీ అధినేత జనగ్ ప్రకటించిన నవరత్నాలకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన రావడంతో వాటిని మండల, జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని జగన్ భావించారు. ఈ మేరకు కార్యాచరణను కూడా రూపొందించుకున్నారు. అలాగే తన పాదయాత్రలో కూడా వీటినే ప్రధానంగా ప్రస్తావిద్దామని జగన్ భావించారు. అయితే ప్రభుత్వం జగన్ హామీలను ముందుగానే ఆచరణలోకి తెస్తుండటం వైసీపీని కలవర పెడుతుందనే చెప్పొచ్చు. ఇక పింఛనును కూడా త్వరలోనే రెండు వేల రూపాయల కు ప్రభుత్వం పెంచనున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు తమకు భయపడే ప్రభుత్వం తమ హామీలను ముందుగా అమలు చేస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద ఎవరు హామీ ఇచ్చినా సరే… అవి ప్రజలకు మేలు జరిగేలా ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది అంటున్నారు సామాన్యులు.

Ravi Batchali
About Ravi Batchali 26760 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*