పీకే టీం సర్వేలను వైసీపీ నేతలు నమ్మడం లేదా?

వైసీపీ నేతలు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను నమ్మడం లేదా? ఆయన టీం చేస్తున్న సర్వేలను కూడా విశ్వసించడం లేదా? అవుననే అంటున్నారు. అందుకే తాము సొంతంగా సర్వలు చేయించుకునేందుకు సిద్ధమయ్యారు. కొందరు ఏకంగా ఇప్పటికే సర్వేలు కూడా చేయించుకున్నారు. ఫలితాలు కూడా వచ్చేశాయి. తాము ఏ సంస్థతో సర్వే చేయించిందీ? దాని ఫలితాలు ఎలా ఉన్నాయన్న నివేదికను కూడా కొందరు నేతలు జగన్ చేతిలో పెట్టారు. జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రను గత ఏడాది నవంబర్ 6వ తేదీన కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభించారు. ఇప్పటికి మూడు జిల్లాలైన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చివరి దశలో ఉంది.

పాదయాత్ర తర్వాత బాగానే ఉన్నా….

అయితే ప్రతి జిల్లాలో ఏడు నుంచి ఎనిమిది నియోజకవర్గాలకు తగ్గకుండా పాదయాత్ర చేశారు జగన్. అంటే దాదాపు నలభై శాసనసభ నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. పాదయాత్ర యావత్తూ పల్లెల నుంచి కొనసాగుతుండటంతో గ్రామ ప్రజల నుంచి మంచి స్పందనే లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ టీం పాదయాత్ర పూర్తయిన కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సర్వే చేసి రిపోర్ట్ ను జగన్ కు సమర్పించింది. పాదయాత్ర తర్వాత ఈ జిల్లాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడినప్పటికీ కొన్ని చోట్ల నియోజకవర్గాల సమన్వయ కర్తలపై తీవ్ర వ్యతిరేకత ఉందని తమ నివేదికలో చెప్పారు. జగన్ ఇస్తున్న హామీలు కూడా ప్రజల్లో మంచి స్పందన తీసుకు వచ్చాయని పేర్కొన్నారు.

కర్నూలు లో పెరిగిన ఆదరణ….

ఈ నేపథ్యంలో కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు నేతలు తాము సొంతంగా సర్వే చేయించుకున్నారు. పాదయాత్ర తర్వాత తమ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, తమ అభ్యర్థిత్వం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారన్న దానిపై లక్షలు వెచ్చించి మరీ సర్వే చేయించుకున్నారు. కర్నూలు జిల్లాలో ఇటీవల ఉప ఎన్నికలో ఓటమి పాలయిన ఒక నేత కూడా సర్వే చేయించారు. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగిన చోట ప్రస్తుతం ఇన్ ఛార్జిలుగా ఉన్న వారు కూడా సర్వే చేయించుకున్నారు. అయితే నేతలు చేయించుకున్న సర్వేలో కర్నూలు జిల్లాలో లోకల్ అభ్యర్థి కన్నా జగన్, వైసీపీ పట్ల ఎక్కువగా ప్రజలు మొగ్గుచూపుతున్నట్లు తేలింది. అంతేకాదు జగన్ ఇచ్చిన హామీలపై కూడా ప్రజలు నమ్ముతున్నారని సర్వే నివేదికలో తేలింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా..ఈసారి సాధారణ ఎన్నికల్లో అక్కడ వైసీపీ గెలుస్తుందన్న ఫలితం వచ్చింది.

అనంతలో హ్యపీ…హ్యాపీ….

ఇక అనంతపురం జిల్లాలోనూ పార్టీ పరిస్థితి మరింత మెరుగైందని సర్వేలో తేలింది. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఈ సర్వే జగన్ పర్యటించిన నియోజకవర్గాల్లో సర్వే చేయించారు. అయితే రెండు, మూడు మినహా మిగిలిన నియోజకవర్గాల్లో వైసీపీకి ఎడ్జ్ ఉందని తేలడంతో అనంత వైసీపీ నేతలు హ్యాపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలుంటే కేవలం కదిరి, ఉరవకొండ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. అనంతపురం, హిందూపురం పార్లమెంటు స్థానాలను కోల్పోయింది. అయితే జగన్ ఇటీవల ఎనిమిది నియోజకవర్గాల్లో దాదాపు 250 కిలోమీటర్ల మేరకు పాదయాత్ర చేశారు. ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో రెండు తప్ప మిగిలిన స్థానాల్లో పార్టీ పుంజుకుందని సర్వేలో తేలింది.

పీకే సర్వేపై నమ్మకం లేకనే….

దీంతో పీకే సర్వే నివేదిక ఏమిచ్చారో తెలియని నేతలు తాము సొంతంగా చేయించుకున్న సర్వే రిపోర్ట్ ను జగన్ ముందుంచారు. తాము పేరున్న సంస్థతోనే సర్వే చేయించామని, నిష్పక్షపాతంగా సర్వే చేసిన నివేదిక ఇదీ అని జగన్ ముందు పెట్టారు. ఈసర్వే ప్రకారం ఈసారి అనంతపురం జిల్లాలో వైసీపీకి సీట్ల సంఖ్య పెరగనున్నాయి. ప్రశాంత్ కిషోర్ టీం కూడా దాదాపు ఇదే నివేదికను ఇచ్చినప్పటికీ స్థానిక నేతల పై ఉన్న అసంతృప్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మొత్తం మీద జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ పార్టీకి బాగానే ఉపయోగపడుతుందని వైసీపీ నేతలు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. జగన్ పాదయాత్ర చేసిన వెంటనే ఇటు పీకే టీం, అటు కొందరు నేతలు సర్వే చేయించుకోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

Ravi Batchali
About Ravi Batchali 33975 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*