పొలిటీషియన్ల పక్కా దోపిడీ

బ్యాంకులే టార్గెట్
బ్యాంకులు దివాలా తీస్తున్నాయి. నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్నాయి. ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకునే రాజకీయ నేతలు బ్యాంకులనూ వదలడం లేదు. పొలిటీషియన్లు బ్యాంకులను తమ వనరులుగా మార్చుకుంటున్నారు. కోట్లలో రుణాలు పొందడం….తీరిగ్గా ఎగ్గొట్టడం లీడర్లకు అలవాటుగా మారింది. దీంతో నిజాయితీగా చెల్లించే సామాన్యులకు రుణాలు అందడం లేదు. బ్యాంకులు కూడా పొలిటీషియన్లు చెబితే ఎన్ని కోట్లయినా సరే …కళ్లు మూసుకుని ఇచ్చేస్తున్నాయి. తర్వాత లబోదిబో మంటున్నాయి.

ఒక్క శాతం వాటాయే నాది : సుజనాచౌదరి
కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావులు బ్యాంకులకు కోట్లలో బకాయీలు పడ్డవారే.  కంపెనీలకు తాము హామీదారుగా మాత్రమే ఉన్నామని బుకాయిస్తున్నారు. కోట్లాది రూపాయలు టోకరా వేసేందుకు పొలిటీషయన్లు అడ్డదారులు తొక్కుతున్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి విషయం తీసుకుంటే మారిషస్ బ్యాంకు నుంచి కోట్లాది రూపాయల రుణం తీసుకున్నారు. సుజనాగ్రూపు వ్యవస్థాపకుడిగా ఉన్న సుజనా చౌదరికి గతంలో నాంపల్లి కోర్టు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే సుజనా మాత్రం తాను మారిషస్ బ్యాంకు నుంచి ఎలాంటి రుణం తీసుకోలేదని, వేరే కంపెనీకి హామీదారుగా మాత్రమే తమ కంపెనీ ఉందని చెప్పారు. కేసు విచారణకు తమ డైరెక్టర్లు హాజరవుతున్నందున తనను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని కూడా సుజనా అప్పట్లో కోర్టుకు విన్నవించుకున్నారు. రుణం తీసుకున్న కంపెనీలో తనకు ఒక్క శాతం వాటా మాత్రమే ఉందన్న సుజనా మోసం చేయడం వేరు…బ్యాంకులకు బకాయీ ఉండటం వేరు అని నీతి సూత్రాలు వల్లించారు.

నోటీసులకూ స్పందించని కావూరి అండ్ కో
ఇక మరో కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావును తీసుకుంటే..ఆయనకు ఎన్నో వ్యాపారాలున్నాయి. ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ పేరిట ఓ సంస్థ కూడా ఉంది. దాని పేరిట దాదాపు 18 బ్యాంకుల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు కావూరి కంపెనీ రుణం తీసుకుంది. కనీసం వడ్డీ వాయిదాలు కూడా చెల్లించడం లేదు. ఆయన అప్పట్లో కేంద్రమంత్రి గా ఉండటంతో బ్యాంకులు కూడా కొంత వెనకంజ వేశాయి. కాని వాయిదాలు సంవత్సరాల తరబడి కట్టకపోవడంతో బ్యాంకర్లకు సహనం నశించి ఏకంగా ఆయన కంపెనీ ఎదుట ఆందోళనకు దిగిన సంఘటనలూ ఉన్నాయి. కనీసం నోటీసులకు కూడా స్పందించడం లేదని బ్యాంకర్లు అప్పట్లో ఆరోపించారు. ఆయన కేంద్రమంత్రి నుంచి తప్పుకుని తిరిగి అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయారు. రుణాలు ఎగ్గొట్టడానికి అధికారపార్టీ అండకావాలి కదా?…

ఎప్పుడో కంపెనీ నుంచి వైదొలిగా : గంటా
ఇక ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 200 కోట్ల రుణాలకు హామీ దారుగా ఉన్నారు. ఇండియన్ బ్యాంకు నుంచి ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ ఫ్రా ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీకి గంటా హామీ ఇచ్చారు. ప్రత్యూష కంపెనీ కూడా కొన్ని నెలల నుంచి వాయిదాలు చెల్లించకపోవడంతోనే ఇండియన్ బ్యాంకు నోటీసులు జారీ చేసింది. గంటా ఆస్తులు స్వాధీనానికి బ్యాంక్ సిద్ధమైంది. ఇందులో గంటాకు చెందిన ఇల్లు కూడా ఉండటం గమనార్హం. అయితే తాను ఎవరికీ బకాయీ లేనని, ప్రత్యూష కంపెనీ నుంచి ఎప్పుడో బయటకు వచ్చేశానని బుకాయిస్తున్నారు. తాను కంపెనీకి హామీదారుగా మాత్రమే ఉన్నానని, వారితో చర్చించి సమస్యను పరిష్కరించుకుంటానని గంటా చెబుతున్నారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన  నామా నాగేశ్వరరావు, సీఎం రమేష్, రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ వంటి రాజకీయ నేతలు బ్యాంకులకు భారీగా బకాయీపడినట్లు వార్తలొస్తున్నాయి.

బ్యాంకులకు వాయిదాలు చెల్లించరు. నోటీసులిస్తే స్పందించరు. బ్యాంకులకు పెద్దోళ్లే ఇలా ఎగవేతలకు పాల్పడుతుంటే…సామాన్య మదుపర్లలో బ్యాంకులపై విశ్వాసం ఉంటుందా? అన్నదే ప్రశ్న.

2 Comments on పొలిటీషియన్ల పక్కా దోపిడీ

Leave a Reply

Your email address will not be published.


*