ప్రకాశంలో టీడీపీ లైఫ్ లైన్ ఇదే..!

టీడీపీ కంచుకోట ప్రకాశం జిల్లాలో త‌మ్ముళ్ల ఫైట్ వీధుల్లోకి ఎక్కేసింది. మ‌రో ఏడాదిలోనే ఎన్నిక‌లు ఉండ‌డంతో ఇక్కడ టీడీపీ ప‌రిస్థితి చేయి దాటి పోతోంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవ‌రివారే య‌మునా తీరే అన్నచందంగా నిన్న మొన్నటి వ‌ర‌కు ఉన్న టీడీపీ నేత‌లు ఇప్పుడు ఆధిప‌త్య ధోర‌ణి రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. ఫ‌లితంగా వివాదాలు స‌ర్దుమ ణగాల్సిన ఎన్నిక‌ల స‌మ‌యంలో, స‌మ‌న్వయం నెల‌కొనాల్సిన కీల‌క త‌రుణంలో త‌మ్ముళ్ల మ‌ధ్య ప‌చ్చగ‌డ్డి వేసినా భ‌గ్గు మ‌నే ప‌రిస్థితి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం.

గ్రూపు రాజకీయాలతో….

విష‌యంలోకి వెళ్తే.. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా అండగా ఉంది. అయితే, గ్రూపు రాజకీయాల కారణంగా 2004 నుంచి టీడీపీ ఇక్కడ ప‌ల‌చ‌నైంది. 2004లో అద్దంకి.. 2009లో మార్కాపురంలో మాత్రమే గెలిచి..టీడీపీ జిల్లాలో ప‌ట్టు కోల్పోయిన ప‌రిస్థితికి చేరుకుంది. అయితే, అనూహ్యంగా 2014 ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో 5 చోట్ల విజ‌యం సాధించింది. అయితే, జిల్లాలో గ‌త వైభ‌వాన్ని సాధించేందుకు చంద్రబాబు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌ను ప‌ఠించారు. దీంతో వైసీపీ త‌ర‌ఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేశారు.

టీడీపీ బలం పెరిగినా….

అదే విధంగా ఇండిపెండెంట్‌గా గెలిచిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా బాబు గూటికి చేరిపోయారు. దీంతో టీడీపీ బలం పదికి పెరిగింది. దీంతో టీడీపీ అధినేత‌ చంద్రబాబు ప్రకాశంలో పార్టీకి పునర్ వైభ‌వం వ‌చ్చేసింద‌ని సంతోష ప‌డ్డారు. ఒకానొక స‌మ‌యంలో ఉబ్బిత‌బ్బిబ్బయ్యారు కూడా. అయితే, ఇది ఎంతో కాలం నిల‌వ‌లేదు. పైకి బలంగా కనిపిస్తున్నప్పటికీ నేత‌ల మ‌ధ్య కుమ్ములాట‌లు పెరిగిపోయాయి. పార్టీ ఇటీవల జరిపిన ఓ సర్వేలో ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులకు గ్రేడింగ్‌లు ఇచ్చారు. బీ, సీ గ్రేడులే రావ‌డంతో నేత‌ల ప‌నితీరు అధినేత‌కు అర్ధమైపోయింది.

ఇక్కడ ఒకరంటే ఒకరికి….

ఉదాహ‌ర‌ణ‌కు.. మార్కాపురంలో కందుల నారాయణరెడ్డి వర్సెస్ ఇమ్మడి కాశీనాథ్‌ యుద్ధం నడుస్తోంది. పరస్పరం ఫిర్యాదులతో అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టారు. అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వర్సెస్‌ కరణం యుద్ధం తెలిసిందే. కందుకూరులో పార్టీకి పెద్దదిక్కు లేక కార్యకర్తలు దూరమవుతున్నారు. ఇక్కడ నామినేటెడ్‌ పదవులు కూడా భర్తీ కాకపోవడంతో ద్వితీయశ్రేణి నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే పోతుల రామారావుకు మాజీ ఎమ్మెల్యే దివి శివ‌రాంకు అస్సలు ప‌డ‌డం లేదు.

అవినీతి ఆరోపణలతో….

పశ్చిమ ప్రాంతంలో మూడు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఉపాధి హామీ, నీరు-చెట్టు పనులు, షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగాల్లో వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలున్నాయి. చీరాల నియోజకవర్గంలోనూ మూడు గ్రూపులన్నాయి. ఎమ్మెల్సీ సునీత, మాజీ మంత్రి పాలేటి రామారావులు పార్టీకి నష్టం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఫిర్యాదు చేశారు. ఆమంచి తీరుపైనా ఆయన వ్యతిరేకులు అధిష్టానానికి లేఖలు రాశారు.

వీధిపోరాటాలకు దిగుతూ….

ఇక సంతలనూతలపాడులో ఇన్‌ఛార్జి బీఎన్‌ విజయ్‌కుమార్‌ వ్యవహార శైలి నచ్చక కొందరు నాయకులు మరో వర్గాన్ని తయారు చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యేందుకు పార్టీ ప్రయత్నిస్తుంటే… నాయకులు వర్గపోరుతో వీధిపోరాటాలకు దిగుతున్నారు. దీంతో అధిష్టానం రంగంలో దిగింది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నేతల మధ్య సఖ్యతకు ప్రయత్నిస్తున్నారు. గిద్దలూరులో పార్టీ మారిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డికి పాత టీడీపీ వ‌ర్గానికి ఉప్పు నిప్పుగా వాతావ‌ర‌ణం ఉంది.

మాగుంటను ఎవరూ పట్టించుకోరే…..

ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి త‌ర్వాత ఎమ్మెల్సీ అయిన మాగుంట శ్రీనివాసుల‌రెడ్డిని జిల్లాలో ఎవ్వరూ ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న సీనియార్టీకి పార్టీలో గుర్తింపు లేద‌ని ఆయ‌న తీవ్ర అవ‌మానంతో ఉన్నారు. అసంతృప్తితో ఉన్న ఆయ‌న‌కు వైసీపీ వాళ్లు గాల‌మేస్తున్నట్టు టాక్‌. ఇటీవల మంత్రి పరిటాల సునీత మార్కాపురం, సంతనూతలపాడు, చీరాల నియోజకవర్గాల నేతలతో సమావేశమయ్యారు. సర్దుబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో చేసిన తప్పులను సరిదిద్దుకోవాల‌ని అధినేత నేత‌ల‌ను బాగానే హెచ్చరిస్తున్నా.. ప‌రిస్థితి ఇప్పట్లో అదుపులోకి వ‌చ్చేలా క‌నిపించడం లేదు. పైగా ఎన్నిక‌ల్లో టికెట్లు రాక‌పోతే.. మ‌రింత తీవ్రమ‌య్యే ప‌రిస్థితే క‌నిపించ‌నుంది. ఇదీ ప్రకాశంలో టీడీపీ లైఫ్ లైన్‌!!

Ravi Batchali
About Ravi Batchali 30209 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*