ప్రాంతీయ పార్టీలు గతి ఇంతేనా..??

వ్యక్తి ఇమేజ్, చరిష్మాతో ఏర్పడని ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవా? పార్టీని నడపగల సత్తా…చేవ ఉన్న నేతలు మరణించిన తర్వాత ఆ పార్టీ ముక్కలు కాక తప్పదా? అప్పటి వరకూ వీర వినయ విధేయతలతో ఉన్నవారే వీరత్వం ఎందుకు ప్రదర్శిస్తారు? అప్పటి వరకూ తమ మనసులో దాచుకున్న వన్నింటినీ ఎందుకు బయటకు కక్కుతారు. ప్రాంతీయ పార్టీలకు ఈ తంటా తప్పేట్లు లేదని తమిళనాడు సంఘటన మరోసారి రుజువు చేసింది.

వ్యక్తి ఇమేజ్ తోనే….

ప్రాంతీయ పార్టీల పుట్టుకే వ్యక్తితో పుట్టుకొస్తాయి. ఒక సామాజికి వర్గానికి చెందిన నేతైనా…చరిష్మా ఉన్న లీడర్ అయినా…తనకున్న రాజకీయ అనుభవంతో కొత్త పార్టీ పెడితే ఊహించని స్థాయిలో అనేక రాష్ట్రాల్లో అనేకసార్లు ఫలితాలు వచ్చిన సంగతిని మనం చూశాం. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశమైనా, ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బీఎస్పీ, తెలంగాణలో టీఆర్ఎస్ ఇలా అన్ని రాష్ట్రాల్లో వ్యక్తి మీద ఆధారపడి ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. జనం నాడి చూసి పార్టీ పెడుతుండటంతో వారికి వెంటనే విజయాలూ వరిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నే తీసుకుంటే..కాన్షీరామ్ బహుజన్ సమాజ్ పార్టీ ని నెలకొల్పారు. ఎన్నికల్లో దూసుకొచ్చిందది. కాన్షీరామ్ తర్వాత బీఎస్సీ మాయావతి చేతిలోకి వెళ్లిపోయింది. మాయావతి కూడా సమర్ధంగానే నడపగలుగుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయినా జాతీయ పార్టీలకు దీటుగా బీఎస్సీకి యూపీలో ఒక ఓటు బ్యాంక్ ను క్రియేట్ చేయగలిగారు. అయితే మాయావతి అనంతరం ఆ పార్టీ పరిస్థితి ఏంటన్నది ఎవరూ చెప్పలేరు. ఊహించలేరు. ఇక అదే రాష్ట్రంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీని ములాయం సింగ్ స్థాపించినా… ఆయన బతికుండగానే పార్టీ రెండుగా చీలిపోయింది. సొంత కుమారుడే తండ్రిని ఎదిరించి పార్టీని తన గుప్పిట్లో తెచ్చుకున్నది మనం చూశాం. ఇక తెలంగాణాలో సెంటిమెంట్ ఆధారంగా వచ్చిన టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు ఎన్నికల రికార్డులన్నింటినీ బద్దలు కట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయననూ చివరకు అల్లుడు చంద్రబాబు పదవి నుంచి దించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తర్వాత పార్టీని కూడా బాబు తన చేతుల్లోకి తీసుకున్నాడు.

అన్నాడీఎంకేకు భవిష్యత్ ఉందా…?

ప్రాంతీయ పార్టీలు వ్యక్తి మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి వారి తదనంతరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం కూడా ఉంది. ఎందుకంటే సమర్ధ నేతలు, వారసులు ఉంటే ఆ పార్టీలు కొన్నేళ్లు పాటు మనుగడ సాగించే అవకాశం ఉంది. ఒడిషా బిజూ జనతాదళ్ ను తీసుకుంటే…బిజూ పట్నాయక్ మరణం తర్వాత ఆయన కుమారుడు నవీన్ పట్నాయక్ పార్టీకి పెద్దదిక్కయ్యారు. బిజేడీని ఒడిషాలో అప్రతిహతంగా నడుపుతున్నారు. వరుస విజయాలు నవీన్ వశమయ్యాయి. ఇప్పుడు తమిళనాడు వద్దాం. ఎంజీ రామచంద్రన్ తర్వాత జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కేవలం ఆమె గృహిణి కావడంతో ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేకపోయారు. తర్వాత జయలలిత పార్టీ పగ్గాలు చేజిక్కించుకుని కొన్ని దశాబ్దాల పాటు అన్నాడీఎంకుకు తమిళనాట విజయాలు సాధించిపెట్టారు. ఇప్పుడు జయ మరణం తర్వాత పార్టీ రెండుగా చీలిపోయింది. ఎంజీఆర్, జయకున్న చరిష్మా గల నేతలు ఇప్పుడు ఆ పార్టీలో కరవయ్యారు. అమ్మ బతికున్నంత వరకూ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఆమె చేతిలోనే ఉండేది. ఆమె ఉన్నంత వరకూ నోరు మెదిపే సాహసం ఎవరూ చేయలేకపోయారు. కనీసం పోయెస్ గార్డెన్ ను కూడా కొందరు ఎమ్మెల్యేలు ఇంతవరకూ వెళ్లలేదంటే జయ కమాండ్ ఏ రకంగా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు. సైగలతోనే సమాధానమిచ్చే స్థాయి జయలలితది. ఆ స్థాయి ఇప్పుడున్న నేతలెవరికీ లేదు. ప్రాంతీయ పార్టీల్లో ఇంకో నేతను ఎవరూ ఎదగనీయరు కూడా. అదే వాటికి చేటు తెస్తున్నాయి. ఇప్పుడు అన్నాడీఎంకేలో అదే జరగుతుంది. ఆ పార్టీలో చీలిక అనివార్యమైంది. ఎవరో ఒకరు సీఎం అయినా…మిగిలిన వారు శత్రువులే. తర్వాత జరిగే ఎన్నికకు సమర్ధమంతమైన నాయకత్వం లేదనేది స్పష్టమవుతూనే ఉంది. ఆ పార్టీకి తమిళనాడులో భవిష్యత్ లేదని అర్ధమైపోతూనే ఉంది.

Ravi Batchali
About Ravi Batchali 26827 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*