బాబుకు ఏమయ్యింది…..

shivsena comments on chandrababu

పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చామనే సంతోషమే కాని….., టీడీపీ నేతలు., శ్రేణుల్ని పాత బాబును చూడలేకపోయామనే భావన వెంటాడుతోంది. ఆ మాటకొస్తే ప్రతిపక్షాలు సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఒకప్పుడు చంద్రబాబు గట్టిగా చూస్తేనే వణికిపోయే నేతలు ఇప్పుడు శృతి మించి చెలరేగిపోతున్నా కట్టడి చేయలేకపోతున్నారు. బహిరంగ సభల్లో చంద్రబాబు ఏయ్ అని కన్నెర్ర చేస్తే గడగడలాడిన వాళ‌్ళు ఇప్పుడు కాగడా పెట్టి వెదికినా కనిపించడం లేదు. క్రమశిక్షణకు.,పార్టీ కట్టుబాట్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చే చంద్రబాబులో అది ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. పదేళ్ల తర్వాత ఎన్నో కష్టనష్టాలకోర్చి తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తే అధికారపక్ష నేతలు మాత్రం మళ్లీ రాదు ఈ అవకాశం అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గల్లీ స్థాయి నేతలు మొదలు మంత్రుల వరకు అందరికి అదే తీరు…..అదే దారి……. చోటా నేతలైతే మామూళ్లు…..ఖద్దరు చొక్కాలైతే కబ్జాలు అన్నట్లు తయారైంది ఏపీలో రాజకీయం పరిస్థితి…..

పదేళ్ల నిరీక్షణ…..
ప్రతిపక్ష హోదా నుంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ పదేళ్ళు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎంతోమంది కార్యకర్తలు., నేతలు కష్టపడి సంపాదించుకున్న అధికారం ఇప్పుడు కొందరి చేతుల్లో కేంద్రీకృతమైపోయింది. ఎన్నికలకు రోజుల ముందు పార్టీలోకి వచ్చి నాయకులైపోయిన వాళ్లు పెత్తనం చెలాయించడం ఒక ఎత్తైతే అందినకాడికి దండుకోవడం మరో దారైంది. చివరకు ప్రభుత్వం మంజూరు చేసే సంక్షేమ పథకాలకు సైతం సొంత పార్టీ వాళ్లే కప్పం కట్టాల్సిన దుస్థితి అన్ని ప్రాంతాల్లోను కనిపిస్తోంది. రేషన్‌ కార్డుకు వెయ్యి రుపాయలు., పింఛన్‌కైతే మూడునెలల మొత్తం., ఇళ‌్ళ స్థలాలు., జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల మంజూరుకు మామూళ్లు….. ఇలా ప్రతి ప్రభుత్వ పథకంలో వాటాలు కోరే వాళ్ళు పార్టీకి పీడలా తయారయ్యారు.

ఏది శ్రద్ధ…….
65ఏళ్ల వయసులో ఉదయం నుంచి సాయత్రం వరకు ముఖ్యమంత్రి అలుపు లేకుండా కష్టపడుతుంటే మంత్రుల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది. ముఖ్యమంత్రితో జరిగే సమీక్షల్లో చెవులు అప్పగించి వినడమే తప్ప ప్రభుత్వానికి., ప్రజలకు పనికొచ్చే సలహాలిచ్చే వాళ్లే క్యాబినెట్‌లో కరువయ్యారు. ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకుంటే చాలు జనంతో ఉన్నా లేకపోయినా ఫర్లేదు అనుకునే వాళ్లే 80శాతం క్యాబినెట్‌లో ఉన్నారు. పని తీరు మెరుగుపరుచుకోవాలని ఎన్నిమార్లు సూచించినా నేతలు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలే లేవు. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో ఎన్నో ఉదాహరణలు……. పశ్చిమ గోదావరిలో చింతమనేని తొలి ఏడాది సృష్టించిన సమస్యపై ఇప్పటికీ ఉద్యోగ సంఘాలు గుర్రుగానే ఉన్నాయి. తాసీల్దారు స్థాయి అధికారిపై దాడి చేసినా సిఎం అధికారిదే తప్పన్నట్లు వ్యవహరించారు. విశాఖలో ఎమ్మెల్యే భూకబ్జా వ్యవహారం కూడా బాగానే వేడి పుట్టించింది. నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే రామకృష్ణ రైల్వే అధికారులపై దాడి చేయడం., గుంటూరులో స్పీకర్ కోడెల తనయుడు నడికుడి రైలు మార్గాన్ని అడ్డుకోవడం., కృష్ణాలో రావి వెంకటేశ్వరరావు కాల్పులు ., ఎమ్మెల్సీ అన్నం సతీష్ దౌర్జన్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో జిల్లాలో ఒక్కో స్టోరీ…………..

గతమంతా వైభవమే……
తెలుగుదేశం పార్టీ పగ్గాలు చంద్రబాబుకు చిక్కన తర్వాత క్రమశిక్షణ రాహిత్యాన్ని ఏమాత్రం ఊపేక్షించవారు కాదు. అప్పట్లో కూడా వన్‌మ్యాన్‌ షో నడిచినా బాబు మాటను నేతలు జవదాటే వారు కాదు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటోంది. బాబు డిఫెన్స్‌లో పడినా ఆయన తరపున వకాల్దా పుచ్చకోమని నేతల్ని పురమాయించాల్సి వస్తోంది. ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే పార్టీ వ్యవహారాల్లో ముందుండి చొరవ చూపే నేతలు టీడీపీ నేతల్లో పెద్దగా కనిపించడం లేదు. ఎవరికి వారు ఇల్లు చక్కదిద్దుకునే ప్రయత్నాలు తప్ప పార్టీకి పేరు ప్రతిష్ట తీసుకువద్దామనే ఆలోచన మాత్రం కనిపించడం లేదు. చంద్రబాబు కూడా తన చుట్టూ బలమైన ఐఏఎస్‌ కోటరీ నిర్మించుకుని వారిచ్చే చచ్చు పుచ్చు సలహాలతోనే నెట్టుకొస్తుండటం మరో విషాదం…. ఆల్ ఈజ్ వెల్‌ అంటూ వచ్చే ఫీడ్‌ బ్యాక్‌లు
పుట్టి ముంచితాయనే సంగతి అర్ధం చేసుకోకపోతేనే అసలు కష్టం…

1 Comment on బాబుకు ఏమయ్యింది…..

Leave a Reply

Your email address will not be published.


*