బాబులో ఆ అలజడి…జగన్ కు కలిసివస్తుందనేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబులో అలజడి ఎక్కువయినట్లు కన్పిస్తోంది. సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడూ సంయమనం కోల్పోరు. అలాంటిది గత వారం రోజుల నుంచి ఆయనలో అసహనం కన్పిస్తోంది. ముఖ్యంగా జనసేన ప్లీనరీలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయనలో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. ఏ సమావేశమైనా, అసెంబ్లీలోనైనా జగన్, పవన్ లపైనే ఆయన విరుచుకుపడుతుండటం కన్పిస్తోంది. నాలుగేళ్లు బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఏం తెచ్చుకోలేక ఆ ఆగ్రహాన్ని ఈ ఇద్దరిపైన వ్యక్తం చేస్తున్నారన్న వ్యాఖ్యలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి.

అంత సులువుకాదు….

ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదని చంద్రబాబుకు అర్థమయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ కల్యాణ్ బలంగా చీల్చుకుంటాడన్న నమ్మకం ఆయనకు లేదు. పవన్ కల్యాణ్ వ్యవహార శైలే ఇందుకు నిదర్శనం. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని ప్రజలు ఎక్కువగా విశ్వసించరన్నది ఆయనకు తెలియంది కాదు. కాపు సామాజిక ఓట్లను, యువత ఓట్లను కొంత చీల్చుకునే అవకాశం ఉన్నప్పటికీ ఎక్కువ స్థాయిలో పవన్ ఓట్లను చీల్చలేడన్నది టీడీపీ వర్గాల అంచనా. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును గంపగుత్తగా చీల్చుకుంటే అది అధికార పార్టీకే ప్రయోజనం. కాని ఆ పరిస్థితి కన్పించడం లేదంటున్నారు టీడీపీ నేతలు. తమ అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ చీల్చలేరని….

కాని పవన్ కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును భారీగా చీల్చుకుంటే తమకు విజయం నల్లేరు మీద నడకే అవుతుందని చంద్రబాబు తొలుత భావించారు. కాని పవన్ చేసిన కామెంట్స్ తో ఆ నమ్మకం కోల్పోయారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా వైసీపీకి వెళుతందన్న ఆందోళన టీడీపీ నేతల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగితే వైసీపీకి అడ్వాంటేజీ అవుతుంది. పవన్ కల్యాణ్ ఈ ఏడాదిలో పార్టీని బలోపేతం చేస్తారన్న విశ్వాసమూ టీడీపీలో లేదు. అందుకే ఈ లెక్కలన్నీ వేసుకుని చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.

అందుకే ఆ ఆందోళన….

అందుకే తరచూ పవన్, జగన్ లను టార్గెట్ గా చేసుకుని చంద్రబాబు ఫైర్ అవుతున్నారు. తనను నమ్మమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తాను మిత్రపక్షమైన బీజేపీని నమ్మి మోసపోయానని ఒప్పేసుకుంటున్నారు. తనపై దాడి చేస్తే అది రాష్ట్ర ప్రయోజనాలకే విఘాతమని చెబుతూ వస్తున్నారు. ఇలా మిత్రపక్షమైన బీజేపీని కావాలని దూరం చేసుకున్న చంద్రబాబు పవన్ రివర్స్ గేర్ వేయడంతో అది జగన్ కు అడ్వాంటేజీగా మారుతుందన్న ఆందోళనలో ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తోంది. అందుకే ఆయన ఎప్పుడూ అనని మాట కూడా అన్నారు. తాను ఆగస్టు సంక్షోభం నుంచి బయటపడ్డానని, ఎన్నో క్రైసిస్ లు చూశానని, దీనినుంచి ఎలా బయటపడాలని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిణామాలు ఏపీలో కొనసాగితే జగన్ పార్టీకి అడ్వాంటేజీ అవుతుందని చంద్రబాబు బలంగా నమ్ముతుండటంతో కొంత దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. మరి ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 27636 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*