బాబు ఆ పని చేస్తారంటారా..?

ఆయన రాజకీయ జీవన ప్రస్థానం కాంగ్రెస్ లోనే ప్రారంభం అయ్యింది. విద్యార్థి నేత స్థాయిలోని ఆ యువకుడికి ఎమ్యెల్యే టికెట్ ఇవ్వడమే కాదు మంత్రిని కూడా చేసింది ఆ పార్టీనే. ఆ పార్టీ అండతోనే సొంత మామ ఎన్టీఆర్ పై సైతం పోటీకి సిద్ధం అని ప్రకటించారు కూడా ఆయనే. ఆ తరువాత కాంగ్రెస్ కి చరిష్మా లేదని గ్రహించి టిడిపి లో చేరి మామ ఎన్టీఆర్ కి తలనాలుకలా మారి అన్ని తానై టిడిపి చుక్కాని అయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 40 ఏళ్ళ తలపండిన రాజకీయ అనుభవజ్ఞుల్లో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి బాబు ప్రస్తుతం గడ్డు కాలం ఎదుర్కొంటున్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి గా వున్న ఆయన పదేళ్ళు విపక్షంలో పడని బాధలేదు. కానీ పోరాటం, వ్యూహం సరైన సమయంలో ఎత్తుగడలు చంద్రబాబు ను 2014 లో విభజిత ఏపీకి సీఎం గా మళ్ళీ పాలనా పగ్గాలు దక్కేలా చేశాయి.

బిజెపి కి దూరమైతే బాబు ప్రత్యామ్నాయం హస్తం …

కేంద్రంలోని మోడీ సర్కార్ చంద్రబాబు ను పొమ్మనకుండానే పొగపెట్టేస్తుంది. చేస్తామన్న హామీలు ఏమీ నెరవేర్చకపోవడంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి ఏపీలో చంద్రబాబు వచ్చేశారు. దాంతో బాటు తెలంగాణాలో టిడిపి దాదాపు కనుచూపు మేరలో కానరావడంలేదు. టిడిపికి నిరాశాజనకంగా వున్న ఈ నేపథ్యంలో బిజెపితో పొత్తు వదులుకుంటే వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న మీమాంసలోనే ఆయన ఇప్పటికి పూర్తిగా కమలంతో కటీఫ్ చెప్పలేకపోతున్నారు. టిడిపి గతంలో లాగే కలగూరగంపకు నేతృత్వం వహించి చక్రం తిప్పే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టిడిపి తనకు దశాబ్దాలుగా బద్ద శత్రువు కాంగ్రెస్ తో చేతులు కలిపే అవకాశాలు లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాకపోతే కాంగ్రెస్ తో ముందుకు వెళ్లేందుకు విభజన హామీలన్నీ అమలుచేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామనిరాతపూర్వకంగా ఆ పార్థి అధినేత రాహుల్ గాంధీ హామీ ఇస్తే బాబు హస్తానికి చెయ్యి అందిస్తారన్న ప్రచారం టిడిపి వర్గాల్లో సాగుతుంది.

కాంగ్రెస్ తో చేతులు కలిపితే …

కాంగ్రెస్ తో చేతులు కలిపితే చంద్రబాబు కి బహుళ ప్రయోజనాలే పార్టీ పరంగా కలుగుతాయన్న లెక్కలు వేస్తున్నారు టిడిపి వ్యూహ కర్తలు. ఏపీ ప్రజలకు బిజెపి పై వీలైనంత ఆగ్రహం కలిగేలా చేసి కాంగ్రెస్ విభజన చట్టం చేసింది, హామీలు ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి వారికి కేంద్రంలో మద్దతు ఇవ్వడం ద్వారా వారి చేతే ఆ హామీలు అమలు చేయించాలని ప్రజలకు చెబితే సరిపోతుందని టిడిపి రెండో మార్గం ఆలోచిస్తుందంటున్నారు. ఇది ఒక్క ఏపీ ఫార్ములా అయితే తెలంగాణ ఫార్ములా కూడా చక్కగా వర్క్ అవుట్ అవుతుందంటున్నారు. తెలంగాణాలో భూస్థాపితం అయ్యే పరిస్థితిలో వున్న టిడిపి అక్కడ అధికార పార్టీ కి గట్టి సవాల్ విసిరే స్థాయిలో వున్న కాంగ్రెస్ కి చెయ్యి అందిస్తే కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టొచ్చన్నది వ్యూహమంటున్నారు. టిడిపి అధినేతనే ఓటుకు నోటు కేసుతో రాష్ట్రం వదిలి వెళ్ళేలా చేసిన కేసీఆర్ కు ఈ తాజా ఎత్తుగడతో ఊహించని దెబ్బ కొట్టొచ్చన్న సమాలోచనలు టిడిపి తీవ్ర స్థాయిలో చేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ టాక్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు వుండరన్న నేపథ్యంలో చంద్రబాబు తీసుకునే నిర్ణయం ఎలా వుండబోతుందన్నది ఆసక్తికరం కాబోతుంది.

Ravi Batchali
About Ravi Batchali 22440 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*