
చంద్రబాబుకు పోలవరం పీకల మీదకు వచ్చింది. పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పడం, కేంద్రం కొర్రీలతో ఆయన మనోవేదన చెందుతున్నారు. కేంద్రం అడ్డం తిరగడానికి గల కారణాలేంటన్నది టీడీపీ నేతలకు కూడా అర్థం కావడం లేదు. దీంతో చంద్రబాబు ఈరోజు హుటాహుటిన ఢిల్లీ ప్రయాణమవుతున్నారు. తొలుత పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమై… తర్వాత కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈరోజు కేంద్ర జలవనరుల శాఖమంత్రి గడ్కరీని కలిసి పోలవరానికి పూర్తి సహకారం అందించాలని అభ్యర్థించనున్నారు. పోలవరాన్ని హామీ ఇచ్చిన విధంగా అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో కష్టమవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. కేంద్రం పెడుతున్న ఇబ్బందులను అధిగమించేలా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు.
నేడు గడ్కరీ తో సమావేశం……
పోలవరం ప్రాజెక్టు పనులను కొత్త కాంట్రాక్టు కు అప్పగిస్తే ఊరుకోబోమని, కొత్త కాంట్రాక్టు సంస్థకు అదనంగా చెల్లించాల్సిన మొత్తం తాము చెల్లించబోమని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కాంట్రాక్టును పొందిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఈ పనులను సకాలంలో పూర్తి చేసే పరిస్థితి లేదు. అందువల్ల గడ్కరీతో సమావేశమై కొత్త కాంట్రాక్టు సంస్థ అదనంగా కోట్ చేసిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని వివరించనున్నారు. అది వర్క్ అవుట్ కాకుంటే… ఈ నెపాన్ని కాంగ్రెస్, వైసీపీల పై నెట్టే ప్రయత్నంలోనూ బాబు ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన భూసేకరణ చట్టం వల్లనే అదనపు వ్యయంగా 33 వేల కోట్లకు చేరుకుందని చంద్రబాబు వివరించనున్నారు. కాంగ్రెస్ చేసిన పాపాల వల్లనే భూసేకరణ కష్టమవుతుందని, ప్రాజెక్టు పనుల్లో ఆలస్యం అవుతుందని చంద్రబాబు ఇక వాయిస్ పెంచనున్నారు. ట్రాన్స్ ట్రాయ్ తో పనులు చేయించడం చంద్రబాబుకు అస్సలు ఇష్టం లేదు. కొత్త కాంట్రాక్టరుతోనే అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీళ్లు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా ఉంది. మరి ఈరోజు గడ్కరీ తో జరిగే సమావేశంలో ఏంజరుగుతుందో చూడాలి. మొత్తం మీద చంద్రబాబుకు పోలవరం పీకలకు చుట్టుకునేలా ఉంది.
Leave a Reply