
ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు. ఆయన నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ ఎన్డీఏ నుంచి వైదొలగడానికి గల కారణాలను ఈ సమావేశంలో ప్రధానంగా అమిత్ షా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం మరో ప్రాధాన్యతను సంతరించుకుంది. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశానికి హాజరయినట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం వైసీపీ వ్యూహకర్తగా జగన్ పార్టీకి వివిధ సర్వేలు నిర్వహిస్తున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఏపీ బీజేపీ నేతల సమావేశానికి హాజరుకావడం ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది.
అమిత్ షా ఆహ్వానంతోనే….
ప్రశాంత్ కిషోర్ గతంలో మోడీకి వ్యూహకర్తగా పనిచేశారు. బీహార్ లో జేడీయూకు కూడా ఆయన వ్యూహకర్తగా ఉన్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పనిచేశారు. ప్రస్తుతం ఆయన వైసీపీకి పూర్తి స్థాయిలో తన సేవలందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ బీజేపీతో విడాకులు తీసుకున్న సందర్భంలో ప్రశాంత్ కిషోర్ అమిత్ షా నివాసానికి రావడం హాట్ టాపిక్ గా మారింది. అమిత్ షా ఆహ్వానంతోనే ప్రశాంత్ కిషోర్ ఈ సమావేశానికి వెళ్లారని చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ను చూసిన ఏపీ బీజేపీ నేతలు షాక్ కు గురయ్యారు.
పొత్తు ప్రసక్తి లేదంటున్న….
ఏపీలో బీజేపీ, వైసీపీ పొత్తు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ రాక ఆ ఊహాగానాలకు ఊతమిచ్చిందంటున్నారు. కాని ఏపీలో బీజేపీ పటిష్టత కోసమే ప్రశాంత్ కిషోర్ సలహాలను తీసుకునేందుకు అమిత్ షాను ఆహ్వానించారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీజేపీతో కలిసి నడిచే ప్రసక్తి లేదు. ఇది దాదాపుగా జగన్ నిర్ధారించారు. ప్రత్యేక హోదా ఇస్తే ఏ పార్టీతోనైనా కలిసి నడిచేందుకు సిద్ధమని జగన్ ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదు. దీంతో వైసీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశమే లేదు.
సోషల్ మీడియాను ఎలా?
అయితే అమిత్ షాతో ఉన్న వ్యక్తిగత సంబంధాల దృష్ట్యా ఈ సమావేశానికి ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారని చెబుతున్నారు. ఏపీలో బీజేపీని పటిష్టం చేసేందుకు పీకే సలహాలను అమిత్ షా తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బీజేపీకి పూర్తిస్థాయిలో బీజేపీకి పనిచేసే అవకాశమే లేదు. అయితే ఈ సమావేశంలో టీడీపీ బీజేపీ పై వేస్తున్న నిందలపై ప్రజలకు వివరించడానికి సోషల్ మీడియా ద్వారా ఎలా వెళ్లాలన్నదానిపైనే పీకే సలహాలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో టీడీపీపై ఎదురుదాడికి దిగేందుకు ఎలాంటి వ్యూహాలు రచించాలన్న దానిపైనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీలో పటిష్టతకు ఏమేం చర్యలు తీసుకోవాలో అమిత్ షా నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Leave a Reply