మంత్రి అయ్యన్న అసలు గుట్టు విప్పాడే

స్టీల్ సిటీ విశాఖపట్నంలో భూదందాలు పెరిగిపోతున్నాయని ఆ జిల్లాకు చెందిన నేత, మంత్రి అయ్యన్నపాత్రుడు అంగీకరించడం సంచలనం కల్గించింది. విశాఖలో గత కొన్ని రోజులుగా అనేక చోట్ట భూ దందాలు పెరిగాయని అయ్యన్న ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. తాను అనేకసార్లు పార్టీ పరంగా పోరాడానని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధురవాడ ప్రాంతంలో పోలీసులే దగ్గరుండి ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్నారని అయ్యన్నపాత్రుడు బహిరంగంగా చెప్పడంతో అధికార పార్టీ ఇరుకున పడింది. ఇప్పటికే విశాఖపట్నంలో వేలాది ఎకరాల ప్రభుత్వ, ప్రయివేటు భూములు అన్యాక్రాంతమయ్యాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు కూడా అనేకసార్లు ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. విశాఖ లోని తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిని రైతుల నుంచి కాజేయాలని ప్రయత్నిస్తున్నారని విష్ణుకుమార్ రాజు ఆరోపించిన సంగతి తెలిసిందే.

విశాఖలో భూదందా….

దీంతో పాటుగా విశాఖలోని ఒక భూ కుంభకోణంలో లోకేష్ పాత్ర ఉందని ఇటీవల వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. . విశాఖ నగరంలోని దసపల్లా హిల్స్ భూ కుంభకోణంలో లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని వైసీపీ నేతలు సీబీఐకి ఫిర్యాదు చేశారు. సుమారు 1500 కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జాకు గురైందని ఆరోపిస్తున్నారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి కురుపాం రాజవంశస్థురాలు రాణీ కమలమ్మను బినామీగా చేర్చారని వైసీపీ నేతలు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. . ఈ విషయాలన్నింటినీ రైట్ టు ఇన్ ఫర్మేషన్ యాక్ట్ కింద సేకరించామని, సీబీఐకి అన్ని ఆధారాలను సమర్పించామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ భూకుంభకోణంపై హైకోర్టుకు కూడా వెళ్లేంందుకు వైసీపీ నేతలు చెప్పారు. ఇటీవల జరిగిన మహానాడులో లోకేష్ సయితం తనపై అనేక ఆరోపణలు చేస్తున్నారని, వీటిపై చర్చించడానికి ఎక్కడికైనా రావడానికి సిద్ధమని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కలకలం రేపాయి. విస్తరిస్తున్న విశాఖ నగరంపై ఇప్పటికే కొందరు కన్నేసి ప్రభుత్వ, ప్రయివేటు భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడు సూచించినట్లు విశాఖ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేయాలని విశాఖ నగర వాసులు కోరుతున్నారు. మరో వైపు జిల్లాలో 20 వేల కోట్ల భూకుంభకోణం వెలుగు చూసినట్లు కలెక్లర్ కూడా అంగీకరించారు. అయితే ఒక్క సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాలేదన్నారు. దస్ పల్లా భూముల వ్యవహారంలో కోర్టు చెప్పినట్లుగానే అధికార యంత్రాంగం నడుచుకుంటుందని కలెక్టర్ చెప్పారు. అన్ని రికార్డులూ సక్రమంగా ఉన్నాయన్నారు.

Ravi Batchali
About Ravi Batchali 36874 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*