మంత్రులకు, సీఎంవోకు మధ్య కోల్డ్ వార్

తెలంగాణ

తెలంగాణలో ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య వివాదం రాజుకుంటోంది. నిన్న మొన్నటి దాకా జిల్లా కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు మధ్య వివాదాలు నడిస్తే… ఏకంగా ఇప్పుడు అది ముఖ్యమంత్రి పేషీ అధికారులకు పాకింది. ముఖ్యమంత్రి పేషీలోని అధికారులు మంత్రులను సయితం లెక్క చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రులు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడం, ఫైళ్లను వేగంగా క్లియరెన్స్ చేయకపోవడంతో పాటు ఏదో ఒక కొర్రీలు వేస్తుండటంతో మంత్రులు సయితం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎంఓలోని అధికారుల పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసే ధైర్యం లేకపోవడంతో సమయం కోసం వేచి చూస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేషీలో స్మితా సబర్వాల్, రాజశేఖర్ రెడ్డి వ్యవహార శైలిపట్ల మంత్రులు అసంతృప్తిగా ఉన్నారు. తాము అర్జంట్ పనుల నిమిత్తం ఫోన్ చేసినా స్పందించడం లేదని కొందరు మంత్రులు బహిరంగంగానే వాపోతున్నారు.

ఫైళ్లను తొక్కి పెడుతున్న అధికారులు…….

నిన్న మొన్నటి వరకూ కలెక్టర్లకు, మంత్రులు, ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఎట్టకేలకు నిజామాబాద్ కలెక్టర్ యోగితారాణాను బదిలీ చేశారు. మహబూబాబాద్ కలెక్టర్ వివాదం నడుస్తూనే ఉంది. ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ ప్రీతిమీనా మధ్య మాటలు కూడా లేవు. అలాగే గతంలో కరీంనగర్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గొడవకే దిగారు. జనగామ కలెక్టర్ దేవసేనపై అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులమైన తమను ఐఏఎస్ అధికారులు పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులు వాపోతున్నారు. అయితే ఇప్పుడు సీఎంఓ అధికారులతోనే సమస్య వచ్చింది. ముఖ్యమంత్రి పేషీలో ముఖ్యకార్యదర్శి నర్సింగరావుతో పాటు మరో నలుగురు అధికారులున్నారు. శాంతికుమారి, స్మితా సబర్వాల్ లు కార్యదర్శుల హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ప్రత్యేక కార్యదర్శులుగా కొనసాగుతున్నారు. వీరంతా ప్రగతి భవన్ లోనే ఉంటున్నారు. సచివాలయానికి రావడమే మానుకున్నారు. ముఖ్యమంత్రి ఫాం హౌస్ కు వెళ్లినా, ఢిల్లీ పర్యటనకు వెళ్లినా వీరు మాత్రం సచివాలయానికి రావడం లేదు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్యమైన పనుల కోసం వీరి మీద ఆధారపడాల్సి వస్తోంది. సహజంగా పార్టీకి నమ్మకంగా పనిచేసే వారినే సీఎంవోలో నియమిస్తారు. నేతల ముఖ్యమైన పనులను చేసిపెడతారనే సీఎంఓ అధికారులకు సహజంగా ప్రాధాన్యత ఉంటుంది. కాని ఇక్కడ మాత్రం రివర్స్ అయింది. మంత్రులు చెప్పిన పనులకు కూడా కొర్రీలు వేస్తూ ఫైళ్లను తొక్కిపెడుతుండటతో వారు ఆందోళన చెందుతున్నారు. మంత్రివర్గంలో కీలక మంత్రికి సీఎంవో అధికారులు ఇటీవల షాక్ ఇచ్చారు. ఒక కీలక ఫైలుకు సంబంధించి సదరు మంత్రి పంపిన ఫైలును కొన్ని కారణాలను చూపి రిజెక్ట్ చేసి పంపడంతో ఆయన ఫైరవుతున్నారు. కనీసం ఫోన్లు కూడా ఎత్తడం లేదని మంత్రులు వాపోతున్నారు. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందనే చెప్పొచ్చు.

Ravi Batchali
About Ravi Batchali 38976 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*